- తగ్గిన నేరాలు, రోడ్డు ప్రమాదాలు
- వివరాలను వెల్లడించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు మెరుగుపడుతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, ప్రమాదాలు, నేరాలను నియంత్రించడానికి ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. గతేడాది తొలి ఆరు నెలల(2023 జనవరి నుంచి జూన్ 30 వరకు)తో పోల్చితే ఈ ఏడాది(2024 జనవరి నుంచి జూన్ 30 వరకు) హత్యలు, హత్యాయత్నాలు, నేరాలు తగ్గుముఖం పట్టాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. గతేడాది తొలి ఆరు నెలల్లో 47 హత్యలు జరగగా, ఈ ఏడాది 45 హత్యలు జరిగాయి.
గతేడాది 155 హత్యాయత్నం కేసులు నమోదైతే ఈసారి 145కు పరిమితమయ్యాయి. తీవ్రమైన దాడుల కేసులు గతేడాది 151 కేసులు నమోదైతే ఈ ఏడాది 103 నమోదయ్యాయి. అంటే 27 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సఫలమయ్యారని అధికారులు పేర్కొన్నారు.
డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్
నగరంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా టీజీఏఎన్‌బీ (తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో) సిబ్బందికి నూతన వాహనాలు కొనుగోలు చేసింది. గతేడాది తొలి ఆరు నెలల్లో డ్రగ్స్‌కు సంబంధించి 103 కేసు లు నమోదవగా, ఈ ఏడాది 151 కేసులు నమోదయ్యాయి. కేసుల నమో దు, నిందితుల అరెస్టులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
అలాగే నగరంలో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని అధికారులు తెలిపారు. గతేడాది తొలి ఆరు నెలల కాలం లో 209 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటే ఈ ఏడాది 160 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే రోడ్డు ప్రమాదాలు 24 శాతం తగ్గాయి. గతంలో నేరాల్లో భాగస్వాములైన డ్రైవర్లను వదిలి పెట్టడానికి భిన్నంగా ప్రస్తు తం వారిపై కఠినంగా వ్యవహరించడం ప్రమాదాలకు అడ్డుకట్ట వేసిందని పోలీసు అధికారులు తెలిపారు.