నిర్వాహకులు దొండ సంపత్ ను అభినందించిన గ్రామస్థులు...
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. బుధవారం గ్రామంలోని హనుమాన్ ఆలయం సమీపంలో గ్రామస్థులు దొండ సంపత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పోటీల్లో 52 మంది ఆడపడుచులు పాల్గొని అందమైన ముగ్గులను ప్రదర్శించారు. ముగ్గుల పోటీలతో గ్రామంలో సందడిగా మారి పండగ వాతావరణం నెలకొంది. ఈ పోటీలకు పట్టణానికి చెందిన ప్రముఖులు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించి నిష్పక్షపాతంగా విజేతలను ఎంపికచేశారు. మొదటి బహుమతి ప్రవళ్లిక, రెండవ బహుమతి రజిత, మూడవ బహుమతి అంజలిలు గెలుచుకున్నారు. విజేతలకు రామకృష్ణపూర్ ఎస్సై రాజశేఖర్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్వాహకులు చేస్తున్న సేవ సంస్థ కార్యక్రమాలను కొనియాడారు. ఇదిలా ఉండగా గ్రామంలో వరుసగా నాలుగవసారి ముగ్గుల పోటీలు నిర్వహించడం, గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు మూడవసారి సాయంత్రం సమయంలో అల్పాహారం అందజేయడం, పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.