- సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు
- ఈనెల 10న పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్‌తో పాటు విచారిస్తామన్న ధర్మాసనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపగా బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదించారు.
కేటీఆర్ వేసిన పిటిషన్‌ను.. గతంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌తో కలిపి విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య లు తీసుకోకుండా తెలంగాణ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ జనవరి 29న సుప్రీంలో రిట్ దాఖలు చేశారు.
స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. కాగా, ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన పిటిషన్‌తోపాటు కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్ కూడా ఒకే వ్యవహారానికి సంబంధించినది కావడంతో రెండింటిని ఈ నెల 10న విచారి స్తామని ధర్మాసనం వెల్లడించింది.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), కాలె యాదయ్య(చేవెళ్ల), ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు),సంజయ్‌కుమార్(జగిత్యాల) కాంగ్రెస్‌లోకి చేరిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నికలకు సిద్ధంకండి..
బీఆర్‌ఎస్ సైనికులారా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సోమవారం స్పందించారు.