- ఏపీ రిటైర్డ్ అధికారులు తెలంగాణకు కావాలట.!
- నీటిపారుదలశాఖలో వింత ప్రతిపాదనలు
- నీటి పారుదల సలహాదారునికి మరో ముగ్గురు సలహాదారులా?
- తెలంగాణ అధికారులను కాదని ఏపీ నుంచి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం
- ఉద్యోగ సంఘాలు, ప్రతినిధుల మౌనం
- ఆర్థిక శాఖ అనుమతి తరువాత.. జీవో జారీ
ఎక్కల్‌దేవి శ్రీనివాస్ :
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నీళ్లు.. నిధులు.. నియామకాలు.. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ అయిన ఈ మూడు అంశాల్లో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లనే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి.. కొట్లాడి... సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
అయితే పదేండ్ల తరువాత.. మరోసారి తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి కనపడుతోంది. దీనికి నీటిపారుదల శాఖ వేదికగా మారే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇందుకు కారణం.. తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ వద్ద పనిచేసేందుకు సిబ్బందిని నియమించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
సిబ్బం దిని నియమిస్తే ఆత్మాభిమానం ఎలా దెబ్బతింటుందనే అనుమానం రావచ్చు.. కానీ ఇలా నియమించనున్న సిబ్బంది యావత్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి.. నేడో.. రేపో ఆర్థికశాఖ అనుమతులు రాగానే.. ఆ సిబ్బంది నియామ కానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
నిబంధనలను పక్కనపెట్టి..
నిజానికి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ సలహాదారుగా రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించినప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయిన వారిని తెలంగాణ సాగునీటి పారుదలశాఖకు సలహాదారుగా (క్యాబినెట్ హోదా) ఎలా నియమిస్తారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి.
ఇప్పుడు ఆయన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నియామకానికి సంబంధించి కొత్త విమర్శలకు తెరలేస్తోంది. వాస్తవానికి గతం నుంచి ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం సలహాదారుని కార్యాలయంలో పనిచేసేందుకు ఒక పీఎస్, ఒక పీఏ, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు అటెండర్లను ఇవ్వవచ్చు.
సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయంలో పనిచేసేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు డ్రైవర్లు, నలుగురు అటెండర్లను నియమించింది. మిగిలిన సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంది.
సలహాదారుకే.. సలహాదారులా?
తాజాగా ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనల ప్రకారం.. నీటిపారుదల సలహాదారు అయిన ఆదిత్యనాథ్ దాస్‌కు సహాయంగా సేవలు అందించేందుకు మరో ముగ్గురు సలహాదారులను నియమించాలనే ప్రతిపాదనల ప్రభుత్వం వద్దకు చేరింది. సలహాదారునికే.. సలహాదారులా అనే అనుమానం మీకుకూడా వచ్చింది కదా.. అదే చెబుతుంది కూడా.
సలహాదారునిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌కు సహాయకులుగా.. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ (ఆర్థిక సలహాదారు), ఒక టెక్నికల్ అడ్వైజర్ (సాంకేతిక సలహాదారు)తోపాటు అడ్వైజర్ టు అడ్వైజర్ (సలహాదారుకు.. సలహాదారు)గా ముగ్గురిని నియమించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం.
మరో ముగ్గురుకూడా..
సలహాదారుకే.. సలహాదారులు కాదు.. మరో ముగ్గురిని కూడా నియమించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తుంది. ఇందులో ఒకరు సలహాదారుకు ఓఎస్డీగా.. మరొకరు ఆయనకు పీఎస్ (పర్సనల్ సెక్రెటరీ)గా, ఇంకొకరు పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా నియమించాలని ఆయా వ్యక్తుల పేర్లతోపాటు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి.
అందరూ ఆంధ్రప్రదేశ్ రిటైర్డు ఉద్యోగులే..
ఇలా తెలంగాణ ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనల్లో పేర్కొన్న వారందరూ ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డు అయిన అధికారులు, ఉద్యోగులు కావడమే అసలైన తిరకాసు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాతకూడా ఏపీలో రిటైర్డు అయినవారిని ఇక్కడ సలహాదారు సిబ్బందిగా నియమించాలనే ప్రతిపాదనలు రావడంపై సచివాలయం ఉద్యోగులుకూడా విస్మయం.. ఆవేదన.. ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సాగునీటి పారుదల సలహాదారునికి సిబ్బందిగా నియమించాలంటూ వచ్చిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి..
* ఏపీలోని మార్క్‌ఫెడ్‌లో ఏజీఎంగా రిటైర్డు అయిన ఒక అధికారిని తెలంగాణ సాగునీటి సలహాదారుకు కార్యాలయంలో ‘విష్ణు చక్రం’ తిప్పాలనే ఉద్దేశంతో ఆర్థిక సలహాదారునిగా నియమించాలంటూ ప్రతిపాదనలు వచ్చాయి.
* నీటిపారుదల సలహాదారునికి టెక్నికల్ సలహాదారునిగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలో సీఈగా పనిచేసి రిటైర్డ్ అయిన అధికారి పేరును ప్రతిపాదించినట్టు సచివాలయ వర్గాలు ‘సత్యం’ అంటూ చెబుతున్నాయి.
* ఇక సలహాదారునికే సలహాదారునిగా ఏపీ నీటిపారుదల శాఖలో సీఈ స్థాయిలో రిటైర్డ్ అయిన అధికారిని పేరును ప్రతిపాదించారు. ఈయన ఢిల్లీలో ఉంటూ.. సిడబ్ల్యూసీ చుట్టూ తిరుగుతూ.. రామా.. క్రిష్ణా.. అంటూ పని చేసుకుంటే సరిపోతుందన్నమాట.
* సలహాదారునికి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఏపీ నీటిపారుదల శాఖలో ఈఈ స్థాయిలో రిటైర్డు అయిన అధికారి పేరును ప్రతిపాదించినట్టు సమాచారం.
* సలహాదారునికి పర్సనల్ సెక్రెటరీ (పీఎస్)గా ఏపీలోని ఒక ప్రభుత్వ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్డు అయిన వ్యక్తి పేరును ప్రతిపాదించినట్టు.. తెలంగాణ సచివాలయంలోని పలువురు ఉద్యోగులు ‘సత్య ప్రమాణం’గా నిజమని చెబుతున్నారు.
* సలహాదరునికి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా ఏపీలోని ప్రభుత్వ శాఖలో రిటైర్డు అయిన ఒక ఉద్యోగి పేరును ఆ ‘ఏడుకొండల శ్రీనివాసు’డి సాక్షిగా ప్రతిపా దించినట్టు సచివాలయంలో చర్చ జరుగుతోంది.
కొసమెరుపు: ఇప్పటికే ఎవరికీలేని విధంగా నిబంధనలు పక్కనపెట్టి సలహాదారునికే సలహాదారులను ప్రతిపాదిస్తూ.. ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలం టూ ప్రతిపాదనలు రావడం ఒక ఎత్తు అయి తే.. ఢిల్లీలోనూ సాగునీటి సలహాదారుకు ప్రత్యేక సిబ్బంది, కార్యాలయం, వాహనాలు ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరడం సచివాలయం సిబ్బందిని తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.
అందరి మూలాలు.. ఆంధ్రానే
ఇలా తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదరు కార్యాలయంలో పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనల్లో పేర్కొన్న అధికారులందరి మూలాలు ఆంధ్రానే కావడం గమనార్హం. దీనిపై ఇప్పుడు సచివాలయంలో తీవ్రంగా చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత..
పరిపాలన అవసరార్థం తెలంగాణ అధికా రులను నియమించుకోవచ్చని.. అలా కాకుండా.. మొత్తం అధికారులందరినీ ఏపీ నుంచి దిగుమతి చేసుకుం టున్నామన్నట్టుగా ప్రతిపాదనలు రావడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నేడో.. రేపో.. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే.. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని సమాచారం.