calender_icon.png 1 April, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవ్వడం సులభమే!

30-03-2025 12:00:00 AM

అన్యోన్యంగా ఉండే ఆ దంపతులకు నాలుగేళ్లయినా పిల్లలు లేరు. భార్యాభర్తల్లో ఏ సమస్య లేదు. ఎందుకో పిల్లలు కలగడం లేదు. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఫలితం దక్కడం లేదు.. ఇలా తెలిసిన వాళ్లంతా అనుకుంటారు. నిజమే ఇలాంటి సమస్యకు చివరి ప్రయత్నం ఐవీఎఫ్ విధానం. ఇందులో పిల్లలు కాకపోతే ఎలా? ఒక్కసారి ఫెయిల్ అయితే మరోసారి అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ సి స్రవంతిరెడ్డి వివరాలను అందించారు. 

ఐవీఎఫ్ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతి అంటే ప్రయోగశాలలో అండాన్ని, శుక్రకణాలను ఫలదీకరణ చెందించి, అభివృద్ధి చెందిన పిండాన్ని మహిళల గర్భసంచిలో ప్రవేశపెట్టడడం దీనిలోని కీలకాంశం. దీంతో వెంటనే గర్భం వస్తుందని, సంతానం కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి అందరికీ తొలిసారే సంతానం కలగకపోవచ్చు. రెండు, మూడు సార్లు ప్రయత్నించాల్సిన రావొచ్చు. కొందరికి సఫలం కాకపోవచ్చు కూడా. ఇందుకు రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. 

ఐవీఎఫ్ ఎవరికి?

సంతానలేమి కారణాలు, వాటి తీవ్రత, ఇతర అంశాలను బట్టి ఐవీఎఫ్ ఎవరికి అవసరమన్నది నిర్ణయిస్తారు. 

అండాశయంలో లోపం: అండాశయాల్లో విడుదలైనా అండం ఫిలోపియన్ గొట్టాల ద్వారా బయటకు వస్తుంది. అండం, శుక్రకణం కలిసేది.. పిండంగా ఏర్పడేదీ ఇక్కడే. ఈ గొట్టాలు దెబ్బతిన్నా, వీటి లోపల అడ్డంకులు ఏర్పడినా ఫలదీకరణ జరగదు. గొట్టాలు దెబ్బతినడానికి చుట్టుపక్కల కణజాలం అతుక్కుపోయి (ఎడిషన్స్), మూసుకుపోయే ప్రమాదముంది. ఇలాంటి వారికి ఐవీఎఫ్ మంచి మార్గం. ఇందులో అండాశయం నుంచి అండాలను సేకరించి, ప్రయోగశాలలో శుక్రకణంతో కలిపి ఫలదీకరణ చెందిస్తారు. 

నెలసరి సమస్య: గర్భధారణలో రుతుక్రమం సజావుగా అవటం ముఖ్యం. లేకపోతే అండం విడుదలయ్యే తీరూ మారిపోతుంది. అధిక బరువు, అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓడీ) వంటివి నెలసరి అస్తవ్యస్తమయ్యేలా చేస్తుంటాయి. నెలసరి సక్రమంగా రావడానికి తోడ్పడే మందులు సమస్యను అప్పటికి సరిచేస్తాయే తప్ప. పూర్తిగా తగ్గించవు. ఇలాంటివారు సంతానం కోసం ప్రయత్నిస్తూ.. 6 నెలలు దాటినా గర్భం ధరించనట్టయితే మరో కారణమేదో ఉందనే అర్థం. వీరికి ఐవీఎఫ్‌తో మంచి ఫలితం కనిపిస్తుంది. 

కారణం: కొందరిలో సంతానలేమికి ఎలాంటి కారణమూ ఉండకపోవచ్చు. అయినా గర్భం ధరించరు. గర్భసంచిలోకి నేరుగా వీర్యాన్ని ప్రవేశపెట్టే పద్ధతి (ఐయూఐ) కూడా విఫలం కావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఐవీఎఫ్ ఉత్తమ మార్గం. 

ఇతర అంశాలు..

సాధారణంగా ఒకసారి ఐవీఎఫ్‌కు ప్రయత్నించినప్పుడు 20 శాతం వరకూ గర్భం ధరించి, సంతానం కలిగే అవకాశముంది. కొందరిలో ఇంకాస్త ఎక్కువగానూ ఉండొచ్చు లేదూ తగ్గొచ్చు. ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవడం మంచిది. 

ఆడవారిలో రజస్వల అయిన దగ్గరి నుంచే అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతూ వస్తాయి. అందువల్ల వయసు మీద పడుతున్నకొద్దీ సంతానం కలిగే అవకాశం సన్నగిల్లుతుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుంది. చిన్న వయసులో.. ముఖ్యంగా 35 ఏళ్ల లోపు మహిళలకు ఐవీఎఫ్‌తో సంతానం కలిగే అవకాశం ఎక్కువ.

35 ఏళ్లు దాటితే సాఫల్యత గణనీయంగా తగ్గుతూ వస్తుంది. 40 ఏళ్లు దాటితే 20 శాతమే ఫలితం కనిపించొచ్చు. అదే 45 ఏళ్లు దాటితే సఫలమయ్యే అవకాశం మూడు శాతమే. మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతుంది. శుక్రకణాల చురుకుదనం సన్నగిల్లుతుంది. అందువల్ల 50 ఏళ్లు దాటితే సంతానం కలగడం కష్టమేనని చెప్పుకోవచ్చు. 

అండాల ప్రిజర్వు ఎందుకు? 

ఇటీవల కాలంలో ఉద్యోగం, కుటుంబ పరిస్థితుల కారణంగా పిల్లలను తొందరగా కనడం లేదు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వాళ్ల ఉద్యోగ విధుల రీత్యా ఆలస్యంగా పిల్లలను కనాలనుకుంటున్నారు. వీళ్ల కోసమే అండం. వీర్యకణాలను ప్రిజర్వ్ చేస్తున్నారు. 

తొలిసారి కాకపోతే?

కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించేవారిలో చాలామంది ఆశించేది తొలిసారే సంతాన భాగ్యం కలగాలని. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కరి శారీరక స్వభావాలు ఒక్కోలా ఉంటాయి. ఆరోగ్యం తీరుతెన్నులూ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి సంతాన చికిత్సలు అందరిలోనూ ఒకేలా పనిచేయవని అర్థం చేసుకోవాలి. ఇవి సంక్షిష్టమైనవి కావడం వల్ల చాలామందికి రెండు, మూడు సార్లూ చేయాల్సి ఉంటుంది. ప్రయత్నిస్తున్నకొద్దీ సంతానం కలిగే అవకాశం పెరుగుతూ వస్తుంది. గర్భం ధరించకపోవడానికి కారణాలు, వాటిని అధిగమించే మార్గాలు అవగతమవుతాయి. తొలి ప్రయత్నంలో గర్భం ధరించనంత మాత్రాన నిరాశ పడరాదు. అక్కడితోనే ఆపటం సరికాదు. దంపతులిద్దరూ వాస్తవ దృక్పథంతో మెలగాలి.

ఐవీఎఫ్ ఫెయిలైతే..

కొందరికి అనుకోకుండా ఐవీఎఫ్ చేసినా విఫలం అవుతుంది. అయినా కూడా నిరుత్సాహ పడాల్సిన పనిలేదు. అండం, వీర్యకణాలు బాగున్నట్లయితే రెండోసారి గర్భం దాల్చడానికి అవకాశం ఉంది. మొదటి దశలోనే అన్ని రకాల సమ్యలు, ఇబ్బందులను తెలుసుకున్న తర్వాతే ఐవీఎఫ్‌కు వెళ్తాం. అందుకే రెండోసారి ప్రయత్నిద్దామని చెబుతాం. ఇలా కాకపోయినా సమీప బంధువులతో సరోగసీ పద్ధతిలో పిల్లలను కనొచ్చు. కొంతమందికి జెనెటిక్స్ సమస్యతో కూడా గర్భస్రావం అవుతుంది. అలాంటి వారికి ఎంబ్రియోలో ఇబ్బందులున్నాయోనని బయాస్పీ చేస్తాం

 డాక్టర్  సి స్రవంతి రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, శుభ ఫెర్టిలిటీ వ్యవస్థాపకురాలు, హైదరాబాద్