20-03-2025 06:06:47 PM
- రేషన్ కార్డ్ లేకపోవడంతో అర్హత కోల్పోతున్న యువత..
- ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలు మార్చాలి..
- రాజీవ్ యువ వికాసం గడువు పెంచాలి..
- ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా అప్లికేషన్ తీసుకోవాలి..
- ప్రగతిశీల యువజన సంఘం కొమరారం గ్రామ కార్యదర్శి గుగులోత్ దేవా..
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులకు అవకాశం కల్పించకపోవడంతో 12 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పెళ్లిళ్లు జరిగి వేరుగా నివాసం ఉంటున్న ఎందరో యువకులు ఇంకా తల్లిదండ్రులు రేషన్ కార్డులోనే కొనసాగుతూ వచ్చారని ప్రగతిశీల యువజన సంఘం ఇల్లందు మండలం కొమరారం గ్రామ కార్యదర్శి గుగులోత్ దేవా అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో నిబంధనలు ప్రకారం పాత రేషన్ కార్డులు డిలీట్ అయితేనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండడంతో పలువురు యువకులు డిలీట్ ఆప్షన్ ద్వారా పాత రేషన్ కార్డులు డిలీట్ అయ్యారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యువతకు చేయూత నందించేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఎంతో ఆశగా శిక్షణతో పాటుగా సబ్సిడీ రుణాలు లభిస్తాయని ఉపాధి పొందవచ్చు అని ఆశతో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఈ సేవా సెంటర్లకు వెళ్తే అక్కడ నిర్వాహకులు వివరాలు నమోదు చేసిన క్రమంలో రేషన్ కార్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంతకుముందు పాత కార్డు డిలీట్ అయిన కారణంగా ఆ నెంబర్ కొడితే దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పడంతో యువకలు చాలా మంది నిరుత్సాహపడుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలంటే సమాకుర్చుకోలేక పోతున్నారని, అలాగే బ్యాంకు సబ్సిడీ షూరిటీ నిబంధన వలన బ్యాంకు అధికారులు షూరిటీ కోసం రకరకాల నిబంధన పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, కాబట్టి బ్యాంకు నిబంధనలు ఎత్తివేయాలని, నేరుగా నిరుద్యోగ యువతకి నగదును చెల్లించాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేస్తామని తెలిపారు.