ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల ఆమోదంతోనే అమలు చేయడం జరుగుతుందని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా ఆదివారం మంచిర్యాల నియోజక వర్గంలోని హాజీపూర్ మండలం ర్యాలీ, గడ్ పూర్, లక్షెట్టిపేట మండలం కొత్తూరు, దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామాలలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో అనేక కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజా పాలన, కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాలలో అందిన దరఖాస్తుల ప్రకారంగా అర్హుల జాబితాను రూపొందించి గ్రామ సభలు, వార్డు సభలలో చదివి వినిపించి జాబితాలో రాని అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు.
ఈ క్రమంలో నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసిన పథకాలు అమలు చేయడం జరుగుతుందని, రైతు భరోసా పథకంలో వ్యవసాయ సాగుకు యోగ్యం అయిన భూములకు సంవత్సరానికి 12 వేలు అందించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలో 2023-24 సంవత్సరంలో 20 రోజులు, అంతకంటే ఎక్కువ పనిచేసిన వారికి సంవత్సరానికి 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఉండి, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని, ఇంటి స్థలం ఉండి ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు అందిస్తున్నామన్నారు.
లబ్ధిదారుల ఎంపికలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అర్హులైన నిరుపేదలకు పథకాలు వర్తించేలా చర్యలు తీసుకున్నామని, గ్రామ సభలో పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామన్నారు. అనంతరం పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో డిఆర్డిఓ కిషన్, హయా మండలాల ఎంపీడీవోలు తహసిల్దారులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.