calender_icon.png 26 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భద్రత కోసం భూభారతి చట్టం అమలు

25-04-2025 11:16:29 PM

తహసిల్దార్ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం..

ధరణిలోని సమస్యలు భూభారతితో పరిష్కారం..

జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి...

వేములపల్లి (విజయక్రాంతి): భూమి భద్రత కోసం భూభారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. భూభారతి 2025 చట్టంపై అవగాహన కల్పించేందుకు అన్ని మండల కేంద్రాల్లో రైతులతో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలనే ఆదేశాల ప్రకారం శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లో భూభారతి చట్టం అవగాహన సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... భూభారతి చట్టంతో రైతులకు చాలా మేలు కలుగుతుందని గతంలోని ధరణిలో ఉన్న సమస్యలన్నిటికి ఈ భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయన్నారు.

దాదాపు 80 శాతం భూ సమస్యలు తాహసిల్దార్ స్థాయిలోనే పరిష్కరించబడతాయని, 10% ఆర్డీవో స్థాయిలో పరిష్కరించబడతాయని, అప్పటికి పరిష్కరించబడనటువంటి తీవ్రమైన సమస్యలు కలెక్టర్ స్థాయిలో 10% పరిష్కరించబడతాయన్నారు. గతంలో లాగా సీసీఎల్ ఏకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. గతంలో ధరణిలో ఏదైనా సమస్య వస్తే తమ పరిధి కాదని, అది హైదరాబాదుకు వెళ్లాల్సి వస్తుందని, తాము చేసిన పొరపాటుకు, ప్రజలకు తమ పరిధి కాదని చెప్పాల్సి రావడం దురదృష్టకరంగా భావించే వాళ్ళమని, కానీ నేడు అటువంటి పరిస్థితి లేదన్నారు. అధికారులకే అధికారాలను ప్రభుత్వం అప్పగించిందని హర్షం వ్యక్తం చేశారు.

ఏదైనా సమస్య వస్తే ధరణిలో సవరణలు చేయడం చాలా కష్టతరంగా ఉండేదని ఇందుకు ప్రజలు అయోమయానికి, ఇబ్బందులకు గురయ్యేవారని తెలిపారు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడనే సవరించే అధికారం ప్రభుత్వం ఇవ్వడం శుభపరిణామం అన్నారు. దీనివల్ల అధికారుల్లో పాలనాదక్షతోపాటు, చిత్తశుద్ధి వస్తుందని, తద్వారా పొరపాటు చేయడానికి ఆస్కారం ఉండదని తెలిపారు. సాదా బైనమా, ఆర్ ఓ ఆర్ లో తప్పులు నమ్మకాల మీద భూమి అమ్మకాలు, కొనుగోలు జరిగేవని దానివల్ల ప్రస్తుతం భూమి ధరలు పెరగడం వల్ల స్వార్థం పెరిగిందని తద్వారా భూ సమస్యలు పెరిగిపోయాయని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎవరైతే కబ్జాలో ఉంటున్నారో వారికే భూపట్టాలు అందించాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూమి సరిహద్దుల సమస్య సైతం ఈ చట్టం ద్వారా పరిష్కరించబడుతుందన్నారు. 

భూ ఆధార్ ద్వారా అన్ని సక్రమంగా అమలు చేసేందుకు పాసుబుక్ లో పట్టాదారుని యొక్క పూర్తి వివరాలతో పాటు నక్ష ఉండడంవల్ల భూమికి భద్రత ఉంటుందని తెలిపారు. చాలా గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని ప్రస్తుతం గ్రామ పాలన త్వరలోనే అందుబాటులోకి వస్తున్నందున గ్రామస్థాయిలోనే అనేక సమస్యలు మటుమాయమవుతాయన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో భూ సమస్యలతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న అదనపు కలెక్టర్ అమిత్ నారాయణను ఆమె అభినందించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు.

ఇప్పటికైనా మన మధ్య నెలకొన్న విభేదాలను మానుకొని అందరం కలిసికట్టుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్లు, నేటి భూభారతి చట్టం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన స్వార్థం కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయాలని అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే కార్యకర్తను విస్మరించదని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న గొప్పనైన మంచి పనులను కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి పలాలను వివరించాలన్నారు.

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ... గత పది ఏండ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ అప్పులను తీర్చడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా మడిమ తిప్పకుండా అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాకముందు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏ విధంగానైతే సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించామో అంతకుమించినటువంటి ప్రజా పాలన మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో శారదా దేవి, ఎంపీ ఓ లలితా దేవి ఆర్ ఐ స్పందన, రైతులు తదితరులు పాల్గొన్నారు.