12-03-2025 12:47:26 AM
ఖమ్మం, మార్చి -11 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మంత్రి మండలంలోని అనాసాగర్ లో ఎం.జి.ఎం.ఆర్. ఈ.జి.ఎస్. నిధులు 18.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, నాచేపల్లిలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, అమ్మగూడెం 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రాజేశ్వరపురంలో 30 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్ల నిర్మాణాలను, చెరువు మాదారం రాజారాం పేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార సంఘం పెట్రోల్ బంకును, చెరువు మాధారంలో ఎం.జి.ఎన్. ఆర్.ఈ.జి.ఎస్. నిధులు 20.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.
సదాశివాపురం ఎస్సీ కాలనీలో సి.ఆర్.ఆర్. నిధులు 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లకు, చెరువు మధారంలో ఎస్సీ కాలనీలో సి.ఆర్.ఆర్. నిధులు 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోఢ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఒక ఎకరం ఎండిపోవద్దని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు తప్పనిసరిగా అందేలా చూడాలని మంత్రి అన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని అన్నారు.
గతంలో వైఎస్సార్ హాయంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను కట్టుకున్నామని, మొదటి విడత అసలు ఇల్లు లేని వారు కట్టుకోవాలని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి విడత 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. నిరంతరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతోందని అన్నారు.
మార్చి నెలాఖరు లోపు సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా నిధులు జమ చేస్తుందని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే సంవత్సరంలో 21 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.