calender_icon.png 6 November, 2024 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా వైద్యంపై నూతన పాలసీ అమలు

05-11-2024 02:49:30 AM

  1. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
  2. నర్సాపూర్‌లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం

మెదక్, నవంబర్ 4 (విజయక్రాంతి)/నర్సాపూర్/కౌడిపల్లి: రాష్ట్రంలో ప్రజా వైద్యంపై ప్రభుత్వం నూతన పాలసీని అమలు చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి ఐదు పడకల సామర్థ్యంతో రూ.50 లక్షలతో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ఆసుపత్రిలో సుమారు వంద మందికి పైగా డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారని, వారిలో 22 మంది నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. వారి కోసం డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

అనంతరం కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్ పీఏసీఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి ఎదుట విద్యార్థుల నిరసన

కౌడిపల్లి: షిఫ్టింగ్ పద్ధతుల్లో కళాశాల చదువులు మాకొద్దు అంటూ కౌడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ కాన్వాయ్ కౌడిపల్లికి వచ్చేసరికి వందలాది మంది విద్యార్థులు నేషనల్ హైవే పైకి వచ్చి మంత్రికి వినబడేలా నినాదాలు చేశారు.

దీంతో కాన్వాయ్‌ని ఆపి కారు దిగిన మంత్రి విద్యార్థుల వద్దకు వెళ్లారు. కళాశాలలో ప్రస్తుతం 343 మంది విద్యార్థులు ఇప్పటికే తరగతి గదుల కొరతతో ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

మళ్లీ డిగ్రీ కళాశాలను సైతం తమ కళాశాలలోనే నడిపిస్తే షిఫ్టింగ్ పద్ధతుల్లో నడిపించాల్సి వస్తుందని, దీంతో తమకు ఇబ్బందులు కలుగుతాయని వాపోయారు. డిగ్రీ కళాశాలను మరోచోటికి  తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన మంత్రి ఆ భవనంలో జూనియర్ కళాశాల విద్యార్థులే చదువుకుంటారని హామీ ఇచ్చారు. 

ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి

మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా లైబ్రరీ అభివృద్ధిలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, అదనపు కలెక్టర్ మెంచు నగేశ్, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కార్యదర్శి సుప్రభాతరావు పాల్గొన్నారు.