19-02-2025 06:43:28 PM
అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన కార్మికులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా నర్సరీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం కనీస వేతనాలను జీవో ప్రకారం చెల్లించుటకు, 8.33 బోనస్ అమలు, సీఎం పీఎఫ్ సౌకర్యం, హాస్పటల్ సౌకర్యం, బ్యాంకు జీతాలు అమలు చేయుటకు నిర్ణయించి మార్చి ఒకటో తేదీ నుండి అమలుకు సర్క్యులర్ విడుదల చేయడం శుభ పరిణామనీ ఏఐటీయూసీ నాయకులు అన్నారు.
బుధవారం కొత్తగూడెం సింగరేణి నర్సరీలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో, సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కృష్ణఫర్ లు పాల్గొని మాట్లాడుతూ... గత అనేక సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా నర్సరీలలో కాంట్రాక్ట్ కార్మికులకు సరైన సౌకర్యాలు లేకుండా, కనీస వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏఐటీయూసీతో పాటు ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని అనేక పోరాటాలు చేసిన ఫలితంగా, 2022లో జేఏసీగా 18 రోజులు సమ్మె చేసి చట్టబద్ధమైన ఒప్పందం చేసుకున్న ఫలితంగా, నేడు సింగరేణి యాజమాన్యం నర్సరీ కార్మికులకు మార్చి ఒకటో తేదీ నుండి జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించుటకు ఇతర సౌకర్యాలు కల్పించుటకు సర్కులర్ ను విడుదల చేశారని తెలిపారు.
అందుకు కృషిచేసిన సింగరేణి డైరెక్టర్స్ కు, ప్రత్యేకంగా సింగరేణి ఫారెస్ట్ అధికారులకు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం-AITUC తో ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కృష్ణకుమారి, నర్సరీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.