calender_icon.png 17 October, 2024 | 2:24 AM

నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు

17-10-2024 12:18:10 AM

కులవృత్తులకు ప్రభుత్వ భరోసా 

గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి 

ఖమ్మం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఈ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని  రామదాసు ఆడిటోరియంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతున్నదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంతింటి కలను నేరవేర్చబోతున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.

దీపావళికి రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం శుభవార్తను అందించబోతున్నదని అన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు ప్రతి పక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ కాకి గోల పెట్టినా తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.  

కుల వృత్తులకు భరోసా 

కుల వృత్తులైన గీత కార్మికులకు, మత్స్యకార్మికులు, ఇతర కులాల వృత్తులు నమ్ముకున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని మంత్రి పొంగులేటి తెలిపారు.  పేదల వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాటించిన ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీయడంతో మహిళలకు తాము ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేదని త్వరలోనే ఆ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు.  

నిరుపేదలను ఎంపిక చేయాలి 

ఇందిరమ్మ ఇండ్లకుఅర్హులైన నిరుపేదలను మాత్రమే ఎంపిక చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిస్తే ఆ ఇంటిని రద్దు చేయడంతో పాటు, సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తయిందని, నాలుగైదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. ప్రతివారం మండలంలోని గ్రామాలను  ఎంపీడీవో, తహసీల్దార్లు తప్పనిసరిగా పరిశీలించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో గణేశ్ పాల్గొన్నారు. 

రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీ

రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులకు రూ.13 వేల కోట్ల రుణమాఫీ తప్పనిసరిగా చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో  8 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  620 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, యుద్ధప్రాతిపదికన అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

తానూ ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుకున్నానని, తనకు ఆనాడు సైకిల్ కూడా లేదని మంత్రి పొంగులేటి చెప్పారు. రెండున్నర కిలోమీటర్లు స్కూల్‌కు నడిచివేళ్లేవాడనని, ఆ బాధలు ఇప్పుడు పిల్లలు పడకూడదనే తన వంతు సాయంగా పీఎస్‌ఆర్ ట్రస్ట్ నేతృత్వంలో బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో గణేశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి, డీఈవో సోమశేఖరశర్మ పాల్గొన్నారు.