- జిల్లాలో అసంపూర్తిగా పాఠశాలల అభివృద్ధి పనులు
- పట్టించుకోని పాలకులు, అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట చేపట్టిన పనులు హైదరాబాద్ జిల్లాలోని పలు పాఠశాలల్లో నత్తనడకన సాగుతున్నాయి.
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా 6నెలల క్రితం జిల్లాలో ఎంపిక చేసిన 384 పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయితే వాటిలో దాదాపు 15శాతం పాఠశాలల్లో పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. వాస్తవానికి పాఠశాలల పునఃప్రారంభం నాటికే పూర్తి కావాల్సిన పనులు ఇప్పటికీ కొనసాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
324 పాఠశాలల్లో పనులు పూర్తి..
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 384పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానికంగా పాఠశాలల్లో కమిటీలు వేసి అమ్మ కమిటీల భాగస్వామ్యంతో పనులు నిర్వహించాలని ప్రభుత్వం సూచనలు చేసింది.
పలుచోట్ల అమ్మ కమిటీల సభ్యులు పనులు చేసినప్పటికీ, మరికొన్ని చోట్ల వారు ఆసక్తి చూపకపోవడంతో కాంట్రాక్టర్లకు పనులను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన తరగతిగదులు, మరుగుదొడ్లు నిర్మాణం, పాడైపోయిన వాటిని బాగుచేయడం, కరెంట్ సరఫరా, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం, సహా పలు సమస్యలను పరిష్కరించారు.
కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకు తోడు స్థానిక ప్రధానోపాధ్యాయుల చొరవ, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల భాగస్వామ్యంతో పాఠశాలల ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా జిల్లాలోని 324పాఠశాలల్ల్లో చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
50 పాఠశాలల్లో పూర్తికాని పనులు..
క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యమో, అధికారుల పర్యవేక్షణ లోపమో కానీ 50కిపైగా పాఠశాలల్లో పనులు ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులను 15రోజుల్లో పూర్తిచేయాలని నెలరోజుల క్రితం కలెక్టర్ అధికారులను ఆదే శించినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. కాగా పనులు ఆలస్యం అవటానికి కాంట్రాక్టర్లు చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.