ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నించాలి. మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. కానీ, వాస్తవానికి జరుగు తున్నదేమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామాలలో ఒకవైపు అతిసార వంటి వ్యాధులు ప్రబలుతుండడం, ఆస్పత్రులలో రోగులకు సరిపడా సౌక ర్యాల కొరత, మరోవైపు ఆసుపత్రుల నిర్వహణ పట్ల శ్రద్ధాసక్తులు కొరవడడం ! ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠ పరచవలసిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతీ ఒక్కరిదీ.
ఏ పద్ధతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేశామన్న ప్రకటనలు తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదు. నేటికీ సగటు గ్రామీణ, గిరిజన, అటవీ ప్రాంతాల పరిస్థితి దయనీయం. ప్రజల అవసరాల మేరకు నిధుల కేటాయింపులు జరగవు. పట్టణ ప్రాంతాలలో కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పేదలకి అందని ద్రాక్ష. ప్రభుత్వ ఆసుపత్రులు సౌకర్యాలు లేక రోగిని వెక్కిరిస్తాయి. పరిస్థితి అంతా రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది.
ప్రభుత్వాసుపత్రులలో సమయానికి వైద్యులు అందుబాటులో ఉండరు. చాలినన్ని మందులు ఉండవు. ముఖ్యంగా సీజన్‌లో దోమతెరలు ఇవ్వ రు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ కరవు. కనీస సౌకర్యాలు లేని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉంటారు. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా ఫలితం ఉండదు. పాండమిక్ తర్వాత అయినా కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆరోగ్య సేవలు మాటలకే పరిమితం అవుతున్నాయి.
ప్రబలుతున్న అతిసార
‘అతిసార వ్యాధి’ని అంగ్ల భాషలో ‘డయేరియా’ అంటారు. ఇది మామూలుగా వైరస్‌వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్‌వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితోపాటు నెత్తురు పడితే ‘డీసెంట్రీ’ అంటారు. పిల్లల్లో మృత్యువుకు ఇది అతిముఖ్య కారణం. డీసెంట్రీ వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి. ‘రోగి బతికితే డయేరియా, చస్తే కలరా అంటారని’ ఓ సామెత వుంది. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ అంచనా ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువసార్లు వదులుగా విరేచనాలు చేసుకుంటే దానిని ‘అతిసారం’ అంటారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. దీనిని సురక్షిత నీరు తాగుతూ, పరిశుభ్రత పాటించడం వల్ల నివారించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 1.7 బిలియన్ అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం అవుతుంది. రోటా వైరస్, అస్ట్రో వైరస్, నార్ వ్యాక్ వైరస్, పికోర్నా వైరస్ మాములుగా కలిగిస్తాయి. డీసెంట్రీ కలిగించే బాక్టీరియాలు, ఈ.కోలై, క్యామపైలోబ్యాక్టర్ జెజెనై, సాల్మొనెల్లా జాతులు, షిగెల్లా ఇవన్నీ నీటి కలుషితాల ద్వారా సంక్రమిస్తాయి. శుద్ధి లేని నీటిలో ఈ వైరస్‌లు వృద్ధి చెందుతాయి. డ్రైనేజీ కాల్వలు పొంగి పొర్లుతుంటాయి. నలభై శాతం రోడ్లు మురుగునీటితో తడిసి ముద్దవుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, శుచి శుభ్రత లేని రెస్టారెంట్లు, ఏండ్ల తరబడి శుభ్రం చేయని మంచి నీటి ట్యాంకులు, కలుషిత ఆహారం వంటివన్నీ డయేరియాకు ప్రధాన కారణం. ప్రజలకు మంచి ఆహార, ఆరోగ్య అలవాట్లు లేకపోవడమూ ఒక కారణం.
డా. యం. సురేష్‌బాబు