28-03-2025 12:19:18 AM
ఇమ్మిగ్రేషన్ బిల్ లోక్‌సభ ఆమోదం..
దేశ భద్రత పెంచేందుకే కొత్త బిల్లన్న అమిత్‌షా..
న్యూఢిల్లీ: ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు లోక్‌సభలో పాస్ అయింది. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘పర్యాటకం, వైద్యం, తదితర అవసరాల కోసం భారత్‌కు వచ్చే వారికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అటువంటి వారిని కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళలా ఆహ్వానిస్తుంది. కానీ ఎవరైతే భారత్‌కు చెడు చేసేందుకు దేశంలోకి రావాలని అనుకుంటారో వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. వారిని ఎప్పటికీ దేశంలో అడుగుపెట్టనివ్వం. అటువంటి వారికి భారత్ ఏం ధరమ్‌శాల (సత్రం) కాదు. దేశ భద్రతను మరింత పెంచేందుకే ఈ బిల్లు’ అన్నారు.
టీఎంసీపై ఫైర్ అయిన షా..
తృణమూల్ కాంగ్రెస్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ‘మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అక్రమ చొరబాటుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. చొరబాట్లను నివారించేందుకు భారత ప్రభుత్వం సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటుకు ప్రతిపాదన చేయగా.. కనీసం దానికి కూడా స్థలం కేటాయించలేకపోయింది. అందుకే 450 కిలోమీటర్ల సరిహద్దులో కంచె పనులు పూర్తవలేదు.
వివిధ దేశాల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారికి తృణమూల్ ఆధార్ కార్డులు ఇప్పిస్తోంది. దక్షిణ 24 పరగణాలలో ఎన్నో నకిలీ ఆధార్ కార్డులను గుర్తించాం. వచ్చే ఏడాది బెంగాల్‌ను బీజేపీ గెల్చుకుంటుంది. రోహింగ్యాలు, అక్రమంగా వలస వచ్చే బంగ్లా పౌరుల సంఖ్య పెరిగిపోయింది. అందుకోసమే దేశ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం’. అని పేర్కొన్నారు.