ఏటా జంటనగరాల్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఏ గల్లీలో చూసినా అదే జోష్ కనిపిస్తున్నది. లక్షల సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. ఇది పోలీసులకు ఎంతో కఠిన సమయం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేయాలి. అదే సమయంలో అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాలి. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అదే సమయంలో భాగ్యనగర గణేశ ఉత్సవ కమిటీ వారిపైనా ఎంతో బాధ్యత ఉంది. లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు తాగు నీటి సదుపాయం, ప్రసాదాల వితరణకు ఏర్పాట్లు చేయాలి.
అలాగే శోభాయాత్ర సజావుగా సాగడానికి పోలీసు అధికారులకు సహకరించాలి. ముందు జాగ్రత్త చర్యగా ఫైరింజన్లు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలి. అన్నిటికి మించి వీలయినంత త్వరగా విగ్రహాల నిమజ్జనం జరిగేలా చూడడం ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలి. బాణసంచా పేల్చడం, మద్యంమత్తులో వాహనాలు నడపడం లాంటివి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇన్నేళ్లుగా సాగినట్లే ఈ ఏడాది కూడా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగాలని భాగ్యనగర ప్రజలు కోరుకుంటున్నారు.
-శ్రిష్ఠి, సికిందరాబాద్.