calender_icon.png 18 January, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి విగ్రహాల నిమజ్జనానికే అనుమతి

11-09-2024 03:07:17 AM

  1. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై స్పష్టత ఇచ్చిన హైకోర్టు
  2. 2021 మార్గదర్శకాలనే పాటించాలని సూచన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 10 (విజయక్రాంతి):  హైదరాబాద్ నగరంలో ప్రజలు అత్యంత వైభవోపేతంగా జరుపుకొనే పండుగలలో వినాయక చవితి అగ్రస్థానంలో నిలుస్తుంది. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణంగా వినాయక చవితి మూడు రోజుల తర్వాత భక్తులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ ట్యాంక్‌బండ్‌కు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

ఆఖరి రోజు నిమజ్జనానికి నగర పోలీసులతో పాటు జిల్లాల నుంచి సైతం వందలాది మంది పోలీసులు బందోబస్తు విధులకు హాజరవుతారు. అయితే, పరిస్థితులు ఇలా ఉండగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయడం కారణంగా హుస్సేన్ సాగర్ కాలుష్యమయం అవుతున్నందున పలువురు సామాజిక కార్యకర్తలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాన్ని కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. 

అనుమతి లేదని ఫ్లెక్సీల ఏర్పాటు.. 

ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ముందుగా ఎన్టీఆర్ మార్గ్‌లో పలు క్రేన్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా, 2021లో హైకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం జరుగుతున్నట్టు పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు.

కాగా, తాజాగా హైకోర్టు నిమజ్జనంపై స్పష్టత ఇవ్వడంతో ఉత్తర్వులకు అనుగుణంగా నిమజ్జనానికి అనుమతి లేదంటూ ట్యాంక్‌బండ్ (సికింద్రాబాద్ మార్గం) వైపు ప్రత్యేక ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పేర్లతో ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ట్యాంక్‌బండ్ వైపు వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్)లో నిమజ్జనం చేయడానికి వీలులేకుండా ట్యాంక్‌బండ్‌పై సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రెయిలింగ్ గ్రిల్స్‌కు అడ్డుగా ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 

మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకే అనుమతి

నగరంలో మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వందలాది విగ్రహాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈ విగ్రహాలన్నీ పీవోపీతో తయారు చేసినవే. కాగా, నెక్లెస్ రోడ్డు మార్గంతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా మూడు అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేయడానికి జీహెచ్‌ఎంసీ 73 ప్రత్యేక పాండ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, హైకోర్టు వినాయక విగ్రహాల నిమజ్జనంపై మంగళ వారం మరోసారి స్పష్టతనిచ్చింది. 2021లో చెప్పిన మార్గదర్శకాలను మాత్రమే అనుసరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించింది.

ఈ ప్రకారం హుస్సేన్‌సాగర్‌లో మట్టి విగ్రహాలు, ఎకో ఫ్రెండ్లీ విగ్ర హాలను మాత్రమే నిమజ్జనం చేయాలని సూచించింది. పీవోపీతో తయారు చేసిన విగ్రహాలను కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న పాండ్స్‌లో మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. హైకోర్టు సూచనలకు అనుగుణంగా పీవోపీ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసే అవకాశం లేనందున మరో వారం రోజు ల్లో జరిగే నిమజ్జనానికి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో చూడాల్సి ఉంది మరి.