calender_icon.png 12 October, 2024 | 8:44 AM

తక్షణమే కులగణన

12-10-2024 02:24:12 AM

ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం 

  1. ప్రణాళిక శాఖకు నిర్వహణ బాధ్యత
  2. 60 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశం 
  3. హర్షం వ్యక్తంచేస్తున్న బీసీ వర్గాలు

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే సమగ్ర కులగణనను ప్రారంభించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సర్వే నిర్వహణ బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాలకు ఆయా రంగాల్లో అవ కాశాల మెరుగుదలను నిర్ధారించడమే లక్ష్యంగా సర్వేను చేపట్టనున్నారు. 

ప్రణాళిక శాఖదే బాధ్యత

వాస్తవానికి కులగణన లక్ష్యంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించింది. కానీ ప్రస్తుతం సర్వే బాధ్యతను ప్రణాళికశాఖకు అప్పగించింది. అయితే సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం బీసీ కమిషన్ వద్ద లేకపోవడంతో వేరే శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించాలని బీసీ కమిషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేపై బీహార్, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను రాష్ట్ర ప్రభు త్వం పరిశీలించింది. ఆయా రాష్ట్రాల్లో అమలుచేసిన విధానాలను అనుసరించి ప్రణాళికశాఖ ఈ సర్వేను చేపట్టనున్నది. 

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో..

ప్రస్తుతం చేపట్టే సర్వేను అరవై రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సర్వే నివేదిక కీలకంగా మారనుంది. బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తమకు రావాల్సిన రిజర్వేషన్ సాధించాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.

రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కులగణన నివేదికతో బీసీలు ఎప్పటినుంచే పోరా డుతున్న రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

వారు కోరుకుంటున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తగినంత ప్రాతినిధ్యం పెంచుకునేందుకు అవకాశం ఉం టుంది. ఈ క్రమంలో కులగణనపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించి జీవో విడుదల చేయడం పట్ల బీసీ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. 

బీసీల పోరాట విజయం: శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షనీయం. ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. ఈ జీవో బీసీలకు దసరా కానుకగా భావిస్తున్నాం. 60 రోజుల్లోనే కులగణన చేపట్టడానికి ప్రణాళిక శాఖను ఎంచుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తు న్నాం.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించిన 24 గంటల్లోనే సమగ్ర కులగణనకు జీవో విడుదల చేయడం పట్ల బీసీ సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక కులగణనపై ఎవరూ రాజకీయ కుట్రలు చేయకుండా కులగణనను సాఫీగా జరిగేలా సహకరించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీ లు, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, మేధావులకు విజ్ఙప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణనను విజయవంతం చేయాలి. 

ఇది కేవలం కులగణననే కాదు : జీ నిరంజన్, బీసీ కమిషన్ చైర్మన్ 

ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేపట్టనున్నారు. అయితే ఇది కేవలం కులగణన మాత్రమే కాదు. కులగణన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఈ సర్వే నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విశ్లేషి స్తాం. తర్వాత రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకుని, అనంతరం బీసీ కమిషన్ అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. 

రాజ్యాంగ సవరణతోనే శాశ్వత పరిష్కారం : ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ, రాజ్యసభ

తెలంగాణ సామాజిక, ఆర్థి క, విద్య, కులగణనపై సర్వే చే పట్టడాన్ని హర్షిస్తున్నాం. సర్వే తర్వాత జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలి. రిజర్వేష న్ అంశంలో 50 శాతం సీలింగ్‌ను ఎత్తేయాలి. సీలింగ్‌ను పరిగణనలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే ఊరుకోం. రాజ్యాంగ సవరణతోనే కులగణనకు శాశ్వత పరిష్కారం. రాజ్యాంగ సవరణపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అన్ని పార్టీలు దీనికి సహకరించాలి. 

మూడు, నాలుగు రోజుల్లో విధి విధానాలు

తక్షణమే తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన అంశాలపై సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మూడు నాలుగు రోజుల్లో విధి విధానాలు వెల్లడించనున్నారు. బీసీ కమిషన్, ప్రణాళిక శాఖ సంయుక్తంగా విధి విధానాలను రూప కల్పన చేయనున్నాయి. ఈ క్రమంలో విధి విధానాలపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే విధి విధానాలను ప్రకటించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇంటింటి సర్వే ప్రారంభం కానున్నది.