శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఇక్కడి జోనల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ఎలక్టికల్, యూబీడీ, వెటర్నరీ, సానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి ప్రజావాణిలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జోనల్ కార్యాలయంలో పలు సమస్యలపై ప్రజల నుంచి 7 వినతులు రాగా... జోన్ వ్యాప్తంగా పలు విభాగాలకు సంబంధించి మొత్తం 17 వినతులు అందాయి. అందులో కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు ప్రజావాణి అత్యంత కీలకమైన వేదికన్నారు.
ప్రజావాణి సందర్భంగా వారి నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేసారు. ప్రతి వినతిని విధిగా సర్కిళ్లలో రికార్డులలో నమోదు చేయాలని, నిర్దిష్ట సమయంలో పరిష్కరించి ప్రజలకు సమాచారం అందించాలని జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి సూచించారు. ప్రతి సోమవారం సర్కిళ్లలో డీసీ సహా ఆయా విభాగాల అధికారులు విధిగా ప్రజావాణిలో అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, ఈఈ మల్లిఖార్జున్, డీడీ శ్రీనివాస్, విల్సన్, సిటీ ప్లానర్ శ్యామ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.