25-04-2025 10:45:45 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో అమాయక హిందువులపై జరిగిన దారుణ దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హుజురాబాద్, జమ్మికుంట ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ డాక్టర్లు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమరవీరులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ అంకం సుధాకర్ మాట్లాడుతూ... అమాయక ప్రజలపై జరిగిన ఈ దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కోశాధికారి డాక్టర్ తొగరు విద్యాసాగర్, కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్, వైద్యులు కృష్ణమూర్తి, నాగలింగం, చంద్రమౌళి, శ్రీకాంత్ రెడ్డి, ఎన్ రమేష్, బండి శృతి, కవిత తదితర వైద్యులు పాల్గొన్నారు.