- కుళ్లిన మాసంపై ఘుమఘుమలాడే రసాయనాలు
- నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు
- రోజుల పాటు ఫ్రిజ్‌లో మాంసం నిల్వలు
- అనారోగ్యం బారిన పడుతున్న జనం
- నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన అధికారులు
మెదక్, నవంబర్ ౨౦ (విజయక్రాంతి) : ప్రస్తుత పరిస్థితుల్లో బిర్యానీ తిందామని రెస్టారెంట్‌కు లేదా హోటల్‌కు వెళ్లాలనుకునే వారు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎందుకంటే చాలా హోటళ్లు పైన పటారం, లోన లొటా రం అన్న చందంగా మారాయి.
జిల్లాలోని అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో బయటపడిన కల్తీ ఆహార పదార్థాలే ఇం దుకు నిదర్శనం. కళ్లు జిగేల్ మనిపించే రెస్టారెంట్ విద్యుత్ కాంతుల మాటున చీక ట్లు కమ్ముకున్న కిచెన్‌లు దాగి ఉన్నాయి. పరిశుభ్రత లేని ఆ కిచెన్‌ను చూస్తే మళ్లీ జీవితంలో హోటళ్ల జోలికి వెళ్లరంటే నమ్మండి.
ధనార్జనే ధ్యేయంగా పలు హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రతను మరచి ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్నా రు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ‘మామూలు’ తనిఖీలు చేస్తూ జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కల్తీ ఆహారం గుర్తింపు
మెదక్‌లో ఇటీవల స్వీట్ షాపులు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే కల్తీకారక ఆహార ఉత్పత్తు లు, కుళ్లిన తినుబండారాలు బయటపడ్డా యి. పరిశుభ్రత లేని కిచెన్ షెడ్‌లను గుర్తించారు. ఇదంతా తెలియని వినియోగదారులు డబ్బులు ఇచ్చి మరీ కల్తీ ఆహారాన్ని తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఇదే పరిస్థితి నెలకొన్నది.
స్వీట్ దుకాణాల్లోనూ..
ఏ సంతోషాన్ని పంచుకోవాలన్నా తీపితోనే మొదలుపెడతారు. అలాంటి మిఠాయి లూ కల్తీ అయితే ఇక చేసేదేం ఉంది. వాడిన నూనెను మళ్లీ వాడడం, రుచి కోసం కెమికల్స్ కలపడం, కల్తీ పాలు, నెయ్యి, ఇతర పదార్థాలతో స్వీట్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయమై మెదక్ జిల్లాకేంద్రంలో మున్సిపల్ శానిటరీ అధికారులు తనిఖీ చేయగా రెస్టారెంట్లలో కుళ్లిన మాసం నిల్వలు, ఇతర పదార్థాలు బయటపడ్డాయి. అలాగే స్వీట్లను కల్తీ నెయ్యి, నూనెలతో తయారు చేయడంతో ఇటీవల ఓ మహిళ, చిన్నారి తీవ్ర అవస్థతకు గురయ్యారు.
ముక్కు మూసుకోవాల్సిందే..
జిల్లాలోని పలు హోటళ్లకు సంబంధించిన కిచెన్‌లోకి వెళ్తే ముక్కు మూసు కోవాల్సిందే. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాం సం, కుళ్లిన పదార్థాల నుంచి దుర్గంధం వెదజల్లుతుంది. కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టు, వారానికోసారి తయారు చేసే మసా లా కర్రీతో పాటు ఇతర నాసిరకం పేస్టులను కూరల తయారీకి వినియోగిస్తున్నారు. వాటినుంచి చెడు వాసన రాకుండా రసాయ నాలు చల్లుతున్నారు.
చాలా హోటళ్లలో వండిన బిర్యానీ మిగిలిపోతే.. అందులోని ముక్కలను తీసి మరుసటి రోజు సరఫరా వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వాసన రాకుండా ఘుమఘుమలాడేలా టెస్టింగ్ ఫౌడర్, ఇతర రసాయనాలను కలుపుతున్నట్లు నిర్ధారించారు. ఇలాంటి భోజనం తినేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘మామూలు’ తనిఖీలు
ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఏడాదికోసారి రెండు, మూడు దుకాణాల్లో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తూ కఠిన చర్యలు తీసుకోకపో వడంతో నిర్వాహకులు జంకడం లేదని స్పష్టమవుతున్నది.
ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఫుడ్‌సేఫ్టీ అధికారి ఒక్కరే ఉండడంతో.. ఏదైనా సమస్య వస్తే మున్సిపల్ శానిటరీ అధికారులు తనిఖీలు చేస్తూ మమ అని పిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారి వివరణ కోసం ‘విజయక్రాంతి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.