మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్
సిద్దిపేట, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ‘నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్నట్లు తయారైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఆఫ్ చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదన్నారు.ఆస్పత్రుల్లో మందులు లేవు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.
సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి రూ. 24 కోట్లతో మంజూరైన క్రిటికల్ కేర్ యూనిట్‌ను, క్యాన్సర్, కీమోథెరపీ, రెడియో థెరపీ యూనిట్‌లను రద్దుచేసి గాంధీ ఆస్పత్రికి తరలించారని మండిపడ్డారు. రోడ్ల నిర్మాణానికి మంజూరైన రూ.200 కోట్లను మంత్రి సీతక్క ములుగు జిల్లాకు తరలించుకెళ్లారని ఆరోపించారు. తదనంతరం సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ చంద్రం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా ఆమె అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం అనారోగ్యంతో మృతిచెందిన టీచర్ కూర రవీందర్ రెడ్డి మృతదేహానికి హరీశ్‌రావు నివాళి అర్పించారు.