calender_icon.png 13 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థులకు అస్వస్థత

05-08-2024 01:26:06 AM

  1. జ్వరంబారిన 20 మంది బాలికలు 
  2. నలుగురు బాలురకు పచ్చకామెర్లు 
  3. ఆందోళనలో పిల్లల తల్లిదండ్రులు

వికారాబాద్ రూరల్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు నిత్యం ఏదో ఒక రోగంతో అవస్థలు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఆదివారం నలుగురు  విద్యార్థులకు పచ్చకామెర్లు సోకి  అస్వస్థతకు గురయ్యారు. వారికి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. నెల రోజుల క్రితం ఇదే పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నాణ్యమైన భోజనం ఇవ్వకపోవడం, పరిసరాలు శుభ్రంగా ఉండకపో వటం, కలుషిత నీరు తాగడంతోనే తరుచుగా పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బూర్గుపల్లిలో ఉన్న బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 20 మంది బాలికలు  గత మూడు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అక్కడి సిబ్బంది విధుల్లో ఉన్న నర్సుతో జ్వరం మాత్రలు ఇప్పించి చేతులు దుపులుకున్నారు.

ఆదివారం పిల్లలకు జ్వరం తీవ్రత పెరగడంతో గత్యంతరం లేక వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిం చాలని వైద్యులను ఆదేశించారు.