30-03-2025 10:14:51 PM
పెన్ పహాడ్: రైతు తమ వ్యవసాయ భూమిలో ఇన్నీ బావులు తీసి మోటర్లు బిగించి పైపులైన్ల ద్వారా పారుగంత చేస్తున్నాడా అని.. పై చిత్రం చూస్తే వామ్మో..! నిజమా అనుకుంటే పొరపాటే. ఒక్క రైతు కాదు, సుమారు 10 మంది రైతులు పైబడి పోటాపోటీగా చెరువు (కుంట మొత్తం) ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణంలో బావులను ఒకరిని చూసి ఒకరు జేసీబీలతో రాత్రికి రాత్రే బావులు తవ్వారు. ఇదంతా ఈకుంటకు పారుగాంతకు సంబందం లేని చెరువు (కుంట) కు ఆనుకొని ఉన్న చెరువుకు పైఎత్తు రైతులు చేసిన అక్రమ బావుల తవ్వక బాగోతం. ఇదీ సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజీపురంలోని మేళకుంట (చెరువు)లో వెలసిన అక్రమ బావులు.
గతంలో ఈ చెరువులో మట్టిని తోలకం పేరుతో చిన్న చిన్న కుంటలు తవ్వి మోటార్లు, పైపులైన్లు సహాయంతో నీటిని తరలించుకునేవారు. ఈ యాసంగిలో సాగుకు మూసీనీరు సరిగా రాకపోవడం.. భూగర్భజలాలు అడగంటి పోవడంతో రైతులు తాము సాగు చేసిన పంటను చేజిక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నంగా అక్రమ బావులు తవ్వి పారుగంతా చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది.. రైతు బాధపడుతుంటే సహాయ పడుదాం.. కానీ బావులు తవ్వకం ఇదీ చట్టవిరుద్ధం కదా..? అని గ్రామస్థులు, మేదావులు, యువత ఖండిస్తున్నారు. అంతేకాదు పర్యావరణానికి ముప్పు కదా..? అని పెర్కోంటున్నారు. అధికారులకు కనిపిస్తున్నా పట్టింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈకుంటను కొందరు రైతులు పూర్తిగా ఆక్రమించుకోవడంతో చెరువు విస్తీర్ణం తగ్గగా.. ఈ రైతులే అక్రమ బావులు తవ్వకం జరగడంతో ఈ కుంటంతా ప్రభుత్వ ఆధీనం నుంచి రైతుల చేతిలోకి పరోక్షంగా ఉండి పోయిందని కేవలం రికార్డులో విస్తీర్ణం నమోదుకే పరిమితం కావడం కొసమెరుపని గ్రామస్థులు అధికారులపై బహిరంగంగానే ఆరోపనలు చేసు కుంటున్నారు. ఇదిఇలా ఉంటే ఎండాకాలం లో మేత కోసం, తాగునీటి కోసం వెళ్ళే పశువులు, చేపల జాలర్లు, పశువుల కాపరులు, బాటాచారులు చెరువులో నీళ్ళు ఉన్నాయని వెళ్ళితే ప్రమాదం చోటు చేసుకోదా..? అని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈబావులలో పడి పాడి గేదెలు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఏదీ ఏమైనా ఇంత ప్రమాద ఘంటిక చిత్రంపై 'విజయక్రాంతి' అధికారుల దృష్టికి ముందస్తుగా తీసుకెళ్ళుతుండడం.. ప్రమాద నివారణ చర్యలపై ఏం చర్యలు చేపడుతారో వేచి చూద్దాంమంటూ గ్రామస్థులు చెప్పకనే చెబుతున్నారు.