31-03-2025 06:35:34 PM
సమస్యలపై ఎమ్మెల్యేని కోరిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ..
భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కోరారు. ఈ మేరకు చర్ల మండలంలో అక్రమ ఇసుక తరలింపు ఆపాలని దానివల్ల రైతులకు పంటలకు పర్యావరణానికి జరిగే నష్టాలను అరికట్టాలని, మండలంలో బహుళజాతి కంపెనీలకు చెందిన మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, కంపెనీల చట్టవిరుద్ద పోకోడలను అరికట్టాలని, భద్రాచలంలో ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా 6 అంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు చనిపోవడానికి కారణమైన బిల్డింగ్ ఓనర్ను, అందుకు తోడ్పడిన ప్రభుత్వ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, షెడ్యూల్ ప్రాంత చట్టాలు ఉల్లంఘించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
విషయాలపై స్పందించిన ఎమ్మెల్యే వెంకటరావు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరమైతే సమస్యల పరిష్కారంలో ప్రజలను, మిమ్మల్ని భాగస్వామ్యలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి జిల్లా నాయకురాలు జడ్చర్ల కల్పన, చర్ల పార్టీ మండల కార్యదర్శి పాలెం చొక్కయ. పిడిఎస్యు నాయకులు మునిగేలా శివ ప్రశాంత్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.