మణుగూరు: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రాశులను రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఎస్బిఐ బ్యాంకు పక్కన ఖాళీ స్థలంలో అక్రమంగా ఇసుకను నిల్వ చేసినట్లు సమాచారం అందుకున్న తహశీల్దార్ ముజాహిద్ తనిఖీలకు డిప్యూటీ తహశీల్దార్ రామ్ నరేష్, ఆర్.ఐ ముత్తయ్యలను ఆదేశించారు. ఖాళీ స్థలంలో నిల్వ ఉన్న ఇసుక రాశులను గుర్తించారు. వాటికి ఎటువంటి అనుమతులు లేకపోవటంతో పంచులు సమక్షంలో సీజ్ చేశారు. నివేదికను తహశీల్దార్ కు అందించారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.