07-02-2025 12:24:21 PM
మణుగూరు/కరకగూడెం,(విజయక్రాంతి): వాల్టా, మైనింగ్ చట్టాలకు విరుద్ధంగా కరకగూడెం మండలం పెదవాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సీపీఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు అక్రమార్కులు పోటా పోటీగా రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తోలకాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అక్రమ ఇసుక మైనింగ్ ను తక్షణమే నిలిపివేసి.. పంచాయతీలో ఇసుక కూపన్‌ల విధానాన్ని తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
మండల కేంద్రంలోని పెదవాగులో ఇసుక అక్రమ దందా గోదావరి ఇసుక ర్యాంపుల తలదన్నేలా జరుగుతున్నాయని.. ఇంత పెద్ద ఎత్తున ఇసుక తోలకాలు జరుగుతున్న ఏ అధికారి పట్టనట్టుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానికంగా ఇళ్ల నిర్మాణం కొరకు స్థానిక అవసరాల రీత్యా ఇసుక తోలుకునేవారన్నారు. అక్రమ ఇసుక తోలకాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.