calender_icon.png 1 February, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తోలకాలు?

01-02-2025 12:06:52 AM

  1. అశ్వారావుపేట మండలంలోని వాగుల్లో తవ్వకాలు
  2. అధికారుల పేరుతో వసూళ్లు!

అశ్వారావుపేట, జనవరి 31: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పలు వాగుల్లో నుంచి నిత్యం ట్రాక్టర్‌లతో వందల ట్రిపుల ఇసుకను తవ్వి, అక్రమంగా తరలిస్తున్నారు. బహిరంగగానే ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నా అధికారులు చూసి చూడినట్టు వదిలేస్తున్నారు.

నారాయణపురం, అనంతారం, నెమిలిపేట, ఖమ్మం పాడు, గుమ్మడవల్లి, గాడ్రాల, దురదపాడు వాగులు అన్ని ఇసుక ట్రాక్టర్లతో రోజు దర్శనం ఇస్తున్నాయి. 25కు పైగా ట్రాక్టర్లు రోజు రెండు వందల నుంచి మూడు వందల ట్రిపుల ఇసుకను వాగుల్లో నుంచి తరలిస్తున్నాయి.

ఏదైనా అవసరాల కోసం ప్రజలు నేరుగా రవాణా చేసుకుంటే అభ్యంతరం అంతగా ఉండదుకానీ.. బహిరంగ మార్కెట్‌లో అమ్మకాల కోసం ఇసుక తోలకాలు  జరుగుతున్నాయి. మార్కెట్‌లో ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ.2,500 ల నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతున్నది. 

ట్రాక్టర్‌పై నెలకు రూ.15 వేల వసూలు

అక్రమ ఇసుక తోలకాలకు అడ్డు రాకుండా ఉండేందుకు కొందరు దళారులుగా ఏర్పడి పోలీస్, రెవెన్యూ అధికారులు పేర్లు చెప్పి ఒక్కో ట్రాక్టర్‌పై నెలకు రూ.15 వేలకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులకు సొమ్ములు చెల్లించకుండా ఇసుక తోలుకునే ట్రాక్టర్‌ల వాహనాలను అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు కూడా తెలుస్తున్నది.

ఆ విధంగా పట్టుబడ్డ వాహనాలకు భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. శనివారం సాయంకాలం, ఆదివారం రోరజుల్లో తమకు సహకరించిన సిబ్బందికి ఇసుక అక్రమ రవాణాదారులు విలాసవంతమైన పార్టీలు, మందు విందు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంత మంది ప్రజా ప్రతినిధులు, ఆధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటే..

కొందరు ఇదే అదునుగా వసూళ్లకు పాల్పడుతున్నరనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణపై అధికారులు దృష్టి పెట్టి కట్టడి చేయకపోతే  ఇసుక దందా మాఫియా చేతులోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై స్థానిక తహసీల్దార్ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.