04-03-2025 06:59:36 PM
జాతీయ రహదారి పేరుతో అక్రమ దందా..
రాత్రివేళ టిప్పర్లతో తరలింపు..
చోద్యం చూస్తున్న అధికారులు..
కామారెడ్డి (విజయక్రాంతి): చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ము కోవడం అంటే ఇదేనేమో.. అక్రమార్కులు ఇసుక, మొరం మాఫియాల ఆగడాలు ఆగడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇసుక, మొరం అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మీదుగా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నుంచి 768 జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. మెదక్ నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వరకు జాతీయ రహదారి పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి నిజాంబాద్ జిల్లా రుద్రూర్ వరకు జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. పనులు బాగానే ఉన్నా ఇసుక మొరం అమ్మకాలు చేపట్టేందుకు అక్రమార్కులు జాతీయ రహదారి పనులకు మొరం ఇసుక తరలిస్తున్నామని చెప్పుతూ అర్ధరాత్రి వేళలో వందల టిప్పర్ ల ఇసుక, మొరాన్ని యదేచ్చగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను ఇసుక మాఫియా మరో మాఫియా వారు అధికార పార్టీ నేతల అండదండలతో కొనసాగిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవలసిన అధికారులు పోలీసు రెవెన్యూ యంత్రాంగం అక్రమ దందా నిర్వహిస్తున్న వారితో చేతులు కలిపి తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తూ నిత్యం లక్షలాది మొరాన్ని ఇసుకను తరలిస్తున్న మాఫియాల ఆగడాలను అరికట్ట లేకపోతున్నారు. నిత్యం లక్షల రూపాయల విలువచేసే ఇసుకను మొరాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెప్పేదొకటి చేసేది ఒకటి అన్న చందం లాగా జాతీయ రహదారి పనులకు వాడుతున్న మంటూ చెబుతూ అడ్డదారిలో అమ్ముకుంటున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు అడ్డుకోవలసిన అధికారులు మామూళ్ల మత్తులో జరుగుతున్నానని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళలో జెసిబిల సాయంతో మొరం తవ్వకాలు చేపడుతూ ప్రజలకు నిద్రలేని రాత్రులను చేస్తున్నారు.
ప్రశ్నించేందుకు, అడ్డుకునేందుకు గ్రామస్థులు ముందుకు వచ్చిన వారికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జాతీయ రహదారి పనుల కోసం అక్బర్ నగర్ వద్ద మొరం తవ్వకాల కోసం అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకే మొరం తవ్వకాలు చేపట్టి తరలించాల్సి ఉంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఉదయం నుంచి అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు మొరం తవ్వకాలు చేపడుతూ రవాణా చేపడుతున్నారు. మొరం తవ్వకాలతో పాటు ఇసుక తవ్వకాలు చేపట్టి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. కొందరు గ్రామస్తులు 100డయల్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే చేరుకున్న పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిన వారి పైన చిరుబురులాడారు. కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు వారి కను సన్నాల్లోనే ఈ అక్రమ ఇసుక, మోరం దందాలు సాగుతున్నాయి అనడానికి నిదర్శనమే పోలీస్ కానిస్టేబుల్ మాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అక్రమార్కులను అడ్డుకోవాల్సింది పోయి 100 డయల్ లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారుల పైనే హెచ్చరించడం భయభ్రాంతులకు గురిచేయ డం చూస్తుంటే అంతా తెలిసే ఈ ఇసుక మొరం దందాలు మాఫియాలు చేపడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక మోరందందా నిర్వహించే అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత వర్ని, రుద్రూర్, ఎస్సైలను వివరణ కోరగా తమ పరిధిలో కాదంటే తమ పరిధిలో కాదని చెప్పడం గమనర్వం.
రాత్రిపూట తవ్వకాలు చేపట్టవద్దు..
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ వద్ద రాత్రిపూట మొరం తవ్వకాలు చేపట్టవద్దని పంచాయతీ రాజ్ ఏ ఈ శ్రీధర్ రావు తెలిపారు.