20-03-2025 02:21:04 AM
ప్రకృతి సంపద కొల్లగొడుతున్న అక్రమార్కులు
‘మామూళ్లు‘గా తీసుకుంటున్న అధికారులు
ఆదిలాబాద్, మార్చ్ 19 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మొరం వ్యాపారులు కొంమంది స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేక కొందరు, కొన్ని ప్రాంతాలకే అనుమతులు తీసుకొని పలు చోట్ల అక్రమంగా మొరం తవ్వేస్తున్నారు. అధికారుల నిఘా కరువవ్వడంతో వ్యాపారస్తులు విచ్చలవిడిగా తమ దందాను కొనసాగిస్తున్నారు.
ప్రకృతి సంపదను కొల్లగోడుతున్న మొరం బాకాసుర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న కోట్లు దండుకొంటున్నారు. ఎత్తయిన గుట్టలతో పాటు సమాంతరంగా ఉన్న గట్టి నేలలను ఇలా దేన్ని వదలకుండా ఇష్టానుసారంగా దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బోథ్, తలమడుగు, తాంసి, నేరడీగొండ, భీంపూర్ బేలా, జైనథ్, అదిలాబాద్ రూరల్ మండలంలోని పలు ప్రాంతాలు, ఇచ్చోడ, వంటి ఏరియాలలో అక్రమ దందా కొనసాగుతున్నాయి.
కొల్లగొడుతున్న ప్రకృతి సంపద...
అక్రమంగ మొరం దందా చేస్తున్న వ్యాపారులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. చెట్లు పుట్టలే కాదు పెద్దపెద్ద గుట్టలను సైతం వదలడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్రమంగా మొరం తవ్వేస్తూ నెల మట్టం చేసేస్తున్నారు. ముఖ్యంగా మారుమూల మండలాల్లో మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి. దర్జాగా మొరం తవ్వకాలు చేపడుతున్న మొరం భకాసురులు కోట్లకు పడగేత్తుతున్నారు. ఫలితంగా విలువైన గుట్టలు, ప్రకృతి సంపద కనుమరుగు అవుతున్నాయి.
ప్రాణాలు తీస్తున్న మొరం గుంతలు...
జిల్లా వ్యాప్తంగా అక్రమ మొరం తవ్వకలతో పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడుతు న్నాయి. గ్రామ శివారుల్లోని ప్రభుత్వ భూముల్లో మొరం కోసం లోతుగా తన్వేస్తుండడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతు న్నాయి. దింతో ఈ గుంతల్లో వర్షపు నీరు నిండి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికి మొరం కోసం తవ్విన గుంతల్లో చిన్నారులు పడి మృతి చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి.
వన్య ప్రాణులు సైతం గుంతలలో పడి ప్రాణాలను కోల్పోతున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం యపల్ గూడలో గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందారు. బంగారు గూడ సమీపంలో గుంతలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఇలాంటి ఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి.
మామూలుగా తీసుకుంటున్న అధికారులు...
జిల్లాలో కొనసాగుతున అక్రమ్న మొరం తవ్వకాలను కడ్డడి చేయాల్సిన అధికారులు వ్యాపారస్తుల నుండి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దింతో ఎలాంటి భయం లేకుండా మొరం బాకాసురులు నెలల తరబడి జేసీబీ, క్రేన్ ల సహాయంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు మొరం ను తవ్వేస్తున్నారు.
టిప్పర్ లలో తవ్విన మొరం ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందా ను కట్టడి చేయాల్సిన అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తూ వ్యాపారస్థులకు సహకరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగేవారు ఎవరు లేరు కదా అని విచ్చల విడిగా తమ పని కానిచ్చేస్తు ప్రభుత్వ ఖజానా కు గండి కొడుతున్నారు. గత పది సంవత్సరాల కాలం నుంచి తవ్వకాలు ఇంకా ఎక్కువగానే జరుగుతుండడం గమనార్హం. ఈ దందాను అడ్డుకునే నాథుడే కరువయ్యాడు.
రోజుకు వందల కొద్ది టిప్పర్లలో మొరం ను తరలిస్తూ ప్రకృతిని కొల్లగొడుతున్నారు. మొరం భకానురులు చేస్తున్న ఈ ఆక్రమ తవ్వకాలపై అడ్డూ అదుపు లేకుండా పోయింది. పల్లెల్లో శివారు ప్రాంతాలన్నీ మొరం అక్రమ తవ్వకాలతో చెరువులను తలపిస్తున్నాయి ప్రకృతి సంపదను దోచుకుంటున్న మొరం భకాసురులపై ఇకనైనా ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించి కొరడా ఝలిపించాల్సిన అవసరం ఎంతైన ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద మొరం గుంతలు ఏర్పడే అవకాశం ఉంది.