కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలోని దంతన్ పల్లి సెక్షన్ ప్రాంతంలోని డోర్లీ 2 వద్ద ఉదయం అటవీ అధికారులు అక్రమ కలప పట్టుకున్నారు. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ సింగ్ సర్దార్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అటవీ శాఖ అధికారి ముందస్తు సమాచారం మేరకు కౌటన్ మొవాడ్ నుండి మందమర్రి వైపు వెళ్తున్న కారు నెంబర్ (ఏపీ10ఏజి 6165) వాహనంలో అక్రమంగా కలప తరలిస్తుండగా ఆసిఫాబాద్, కెరమెరి, జోడేగాట్ సిబ్బంది సమిష్టిగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. కారు అనుమానాస్పదంగా కనిపించడంతో డొర్లీ 2 ప్రాంతంలో ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు.
నిందితులు కారు వదిలి పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిని పట్టుకొని, వారితో పాటు వచ్చిన మరో పల్సర్ బైక్ నెంబర్ టిజి19-0169 తో పాటు ఇద్దరు నిందితులు మెట్పల్లికి చెందిన కుంసోత్ కృష్ణ, సర్వాయిపేటకు చెందిన బానోత్ శంకర్ ను రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో 12 కలప దుంగలు పట్టుకున్నారని, వాటి విలువ సుమారు 56236 రూపాయలు ఉంటుందని నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో సెక్షన్ అధికారులు మహేందర్, సాయి, విజయ్, బీటు అధికారులు ప్రకాష్, సాదిక్, వెంకటేష్, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు.