calender_icon.png 5 January, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవెల్లిలో దొంగ నిర్వాసితులు!

03-01-2025 02:02:42 AM

దళితుల భూమికి దళారులకు పరిహారం

కోట్ల రూపాయలు అక్రమార్కులకు ఫలహారం

  1. పదిహేనేండ్లుగా ఎవరికీ పట్టని బాధితుల వ్యథ
  2. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన నిర్వాసితుడు

* మెట్ట ప్రాంతాన్ని సిరుల మాగాణంలా మారుస్తుందనుకున్న గౌరవెల్లి ప్రాజెక్టు దళారులకు పంట పండించింది. ముంపునకు గురవుతున్న భూములు దొంగ పట్టాదారుల జేబులు నింపాయి. వాటికింద ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం అక్రమార్కులకు ఫలహారమైంది. అధికారుల అవినీతి.. దళారుల అక్రమాలకు వంతపాడింది. ఫలితంగా కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి.

భూములు కోల్పోయిన అసలైన రైతులు బికారులుగా మారారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే కొందరు చనిపోయారు. ఇటీవల  బాధితుడు నందారపు సంపత్ తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగులమందు తాగి ఆత్మహత్యకు  యత్నించడం కలకలంరేపింది. దీంతో మరోసారి దళితుల భూములపై దళారులు పరిహారం కాజేసిన వ్యవహారం బయటకు వచ్చింది. 

హుస్నాబాద్, జనవరి 2: ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీరందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. 

4 వేల ఎకరాలు సేకరణ

గౌరవెల్లి ప్రాజెక్టులో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల పరిధిలోని గుడాటిపల్లితో పాటు తెనుగుపల్లి, సౌళ్లపల్లి, మద్దెలపల్లి, సోమాజీతండా, సేవానాయక్‌తండా, బొధ్యానాయక్‌తండా, జాలుబాయితండా, చింతల్‌తండా, తిరుమల్‌తండా గ్రామాలు పూర్తిగా మునిగాయి. దీంతోపాటు గౌరవెల్లి, జనగామ, రేగొం డ, నందారం, గండిపల్లి గ్రామాల్లో పాక్షికంగా భూములు పోయాయి.

మొత్తం నాలుగు వేల ఎకరాల భూములతోపాటు 1,500 వరకు ఇండ్లు పోయాయి. గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న గండిపల్లి ప్రాజెక్టులో 800 ఎకరాల భూమి, 164 ఇండ్లు పోయాయి. అక్క డ పంచరాయితండా, అంబానాయక్‌తండా, మంజాతండా, శ్రీ రాంతండా, దేవానాయక్‌తండావాసులు సర్వం కోల్పోయారు.

ప్యాకేజీలతో మోసం

కాంగ్రెస్ హయాంలో 1.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు కోసం సేక రించిన భూములకు 2009లో ఎకరానికి రూ. 2.10 లక్షల పరిహారం ఇచ్చారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి 2016లో మరో 1950 ఎకరాలు సేకరించారు. 2017లో సుమారు 1,650 ఎకరాలకు ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఈ పరిహారానికి కొందరు రైతులు ఒప్పుకోలేదు. 2022లో అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఎకరానికి రూ.15 లక్షలు చెల్లిస్తామని నిర్వాసితులతో చర్చలు జరిపారు.

ఇందుకు 250 ఎకరాలకు చెందిన రైతులు ఒప్పుకొని సంతకాలు చేశారు. మిగిలిన 100 ఎకరాలకు చెందిన రైతులకు 2023లో ఎకరానికి రూ.17 లక్షలు ఇస్తామని అధికారులు పిలిపించారు. అందులో 55 ఎకరాలకు చెందిన రైతులు సమ్మతించి పరిహారం తీసుకున్నారు. మిగితా 45 ఎకరాలకు చెందిన రైతులు చట్ట ప్రకారం కాకుండా ప్యాకేజీల పేరుతో తమను ప్రభుత్వం మోసం చేస్తోందని పరిహారం తీసుకోలేదు.

కనీసం తమకు ఎకరానికి రూ.25 లక్షలైనా ఇవ్వాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. కొందరు దళారులు నిర్వాసితులతో ప్యాకేజీల ఒప్పందానికి భారీమొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు అప్పటికప్పుడు పౌల్ట్రీఫాంలు, ఇతర చిన్న పరిశ్రమలు పెట్టుకున్నట్టు అధికారులతో నివేదికలు రాయించుకొని కోట్లాది రూపాయలు అక్రమంగా లబ్ధిపొందినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపితే భారీ కుంభకోణం బయటకు వస్తుంది.

17 మంది దళితులు బాధితులు

అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామానికి చెందిన 17 మంది దళితుల భూములు ప్రాజెక్టులో పోయినా వారికి పరిహారం దక్కలేదు.  

సర్వే నంబర్ 555లో గ్రామానికి చెందిన సించు మల్లమ్మ, కొమ్ముల కొమురయ్య, కొమ్ముల బూదమ్మ, కొమ్ముల లచ్చమ్మ, మాచర్ల వీరమల్లు, కొమ్ముల సుశీల, కవ్వంపల్లి పోచయ్య, నందారపు లచ్చవ్వకు ౧౯౯౬లో నాటి ప్రభుత్వం ఎకరం నుంచి ఎకరం ఐదుగుంటల చొప్పున భూపట్టాలు అందజేసింది.

సర్వే నంబర్ 491లో కొమ్ముల చంద్రయ్యకు 2.20 ఎకరాలు, కొమ్ముల లింగయ్యకు 2.20 ఎకరాలు, కొమ్ముల రాజయ్యకు 1.10 ఎకరాలు, కొమ్ముల మల్లయ్యకు 2.20 ఎకరాలు, కందుకూరి కనకయ్యకు 2.20 ఎకరాలు ఇచ్చారు. సర్వే నంబర్ 464లో కొమ్ముల సంపత్‌కు 1.10 ఎకరాలు, జంగపెల్లి కనకవ్వకు 1.10 ఎకరాలు, యాస రజితకు 1.10 ఎకరాలు, బదనపురం పోచవ్వకు 1.10 ఎకరాలు, నందారపు వెంకటయ్యకు 1.10 ఎకరాల భూమిని పంచారు.

అప్పటినుంచి వీరు ఆ భూములను సాగుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూములు ప్రాజెక్టులో ముంపునకు గురికాలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడంతో ఈ భూములన్నీ ప్రాజెక్టు ప్రభావితానికి లోనై మునిగిపోయాయి.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ధరణిలో వీరికి పాసుబుక్కులు రాలేదు. ఇదేంటని అడిగితే ప్రాజెక్టులో భూములు పోతుండటంతోనే కొత్త పట్టాలు ఇవ్వలేదని అధికారులు బుకాయించారు. పరిహారం ఇస్తామని చెప్తూ పాత పాసు బుక్కులను తీసుకున్నారు. దీంతో తమకు పరిహారం వస్తుందనుకొని దళితులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూశారు. అయినా పరిహారం రాలేదు.

ఈ క్రమంలో నందారపు వెంకటయ్య, ఆయన భార్య కనకవ్వ అనారోగ్యానికి గురై చనిపోయారు. వారి కొడుకు సంపత్, కూతురు సరిత పెద్దదిక్కును కోల్పోయారు. 2017లో పరిహారం ఇస్తామని రెవెన్యూ అధికారులు సంపత్‌తో సంతకాలు తీసుకున్నారు. అయినా పరిహారం రాకపోవడంతో విసిగిపోయి అక్కన్నపేటలోని తహసీల్దార్ ఆఫీసు ముందు ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు. 

భూములు పోయిన సంగతి తెలియదు

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు పోయిన సంగతి బాధిత దళితులకు చాలాకాలంగా తెలియదు. వాటికి పరిహారం వచ్చిన విషయం అసలే తెలియదు. తమ భూములపై వేరేవాళ్లు పరిహారం పొందారని తెలుసుకున్న బాధితులు 2019 నుంచి పోరాటం ప్రారంభించారు.  దీంతో జరిగిన అక్రమాన్ని బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.

దళితులకు దక్కాల్సిన పరిహారాన్ని ఇప్పిస్తామని బుజ్జగించారు. అప్పట్లో వీరి భూములకు పరిహారం పొందిన వారితో ఎంతోకొంత ఇప్పించి సెటిల్ చేశారు. అయితే కొమ్ముల కొమురయ్యకు నేటికీ పరిహారం దక్కలేదు. ఏడేండ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

తన భూమిపై ఎవరు పరిహారం పొందారో చెప్పాలని అడిగినా సమాధానం చెప్పలేదు. తన భూమికి సంబంధించిన రికార్డులను కూడా ఇవ్వడంలేదని బాధితుడు ఆవేదన చెందుతూ అనారోగ్యానికి గురై మంచంపట్టి చనిపోయాడు.

57 మంది దళితేతరులకు ముట్టిన పరిహారం

సర్వే నంబర్లు 491, 464లోని భూముల్లో దళితుల భూములకు పరిహారం అంశాన్ని తేల్చకుండానే అధికారులు 57 మంది దళితేతరులకు మాత్రం పరిహారాన్ని పంపిణీచేశారు. ఐదారు గుంటల్లోనూ రైతులు వ్యవసాయం చేశారని, ఆ భూములు ప్రాజెక్టులో మునిగిపోయాయని నివేదిక తయారు చేశారు.

దళితులకు పంపిణీచేసిన భూముల్లోనే పలువురు అధికారులు, నాయకులు తమ అనునాయుల పేర్లు రాయించుకుని పరిహారం కాజేశారని ఆరోపణలున్నాయి. సర్వే నంబర్ 491లో 40 మందికి ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున రూ.2,14,32,063 కోట్లు, సర్వే నంబర్ 464లో 17 మందికి ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున రూ.౧,౧౮,౧౫,౦౦౦ ఇచ్చారు.

వీరంతా అసలైన నిర్వాసితులు కాదని దళితులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే ఓ వ్యక్తి, మహిళా ఆర్‌ఐ, వీఆర్వోలు, ఇతర అధికారులు కలిసి ఈ తతంగాన్ని నడిపించారని చెబుతున్నారు. రైతులుగా తప్పుడు పత్రాలు సృష్టించడం, బాధితులు కానివారికి పరిహారం వచ్చేలా చేయడంతో అందులో నుంచి వాటాలు పొందే ఒప్పందాలు చేసుకొని డబ్బులు కాజేసినట్టు చెప్తున్నారు.

18 ఏండ్లు నిండినవారికి పరిహారం ఇవ్వడాన్ని ఆసరాగా చేసుకొని తప్పుడు పుట్టినతేదీ సర్టిఫికెట్లు సృష్టించి పరిహారం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

దళారులు పరిహారం పొందారు

గౌరవెల్లి రి జర్వాయర్‌లో దళితుల భూ ములు పోయా యి. వాటిపై దళారులు అక్రమంగా నష్టపరిహారం పొందారు. కొందరు తిరగబడితే వారికి ఎంతోకొంత ముట్టజెప్పారు. భూములు, పరిహారాన్ని కాజేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరికొంతమంది దళితులకు భూములు పోయినా పరిహారం దక్కలేదు. మా నాన్న పరిహారం కోసం తిరిగితిరిగి అనారోగ్యానికి గురై చనిపోయిండు.

 భాస్కర్, మాజీ ఉపసర్పంచి, గౌరవెల్లి 

భూమైనా ఇయ్యాలె.. పైసలైనా కట్టియ్యాలె

సర్వే నంబర్ 491/8లో మా బాపు పేరున 1.10 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి ప్రా జెక్టుల పోయింది. అధికారులు వచ్చి పరిహారం ఇస్తామని సంతకాలు తీసుకున్న రు. ఇప్పటికి కూడా ఇవ్వలేదు. పరిహా రం రాదన్న బెంగతోనే మా అమ్మానా న్న చనిపోయిండ్రు. నేను అప్పు చేసి మా అక్క పెండ్లి చేసిన. మా భూమిపై వేరేవాళ్లు పరిహారం తీసుకున్నరంటున్న రు. అధికారులను అడిగితే సమాధానం చెప్పడంలేదు. అందుకే తహసీల్దార్ ఆఫీసుముందు చనిపోవాలనుకున్న. న్యా యం చేయకపోతే నాకు చావే గతి.

 సంపత్, బాధితుడు

విచారణ జరుపుతున్నం

గౌరవెల్లిలో సర్వే నంబర్లు 491, 464, 555లోని భూ ములు ప్రాజెక్టు లో ముంపున కు గురయ్యాయి. నేను ఇక్కడ బాధ్యతలు తీసుకొని ఆరు నెలలు అవుతుం ది. ఈ భూములపై బాధితులు ఫిర్యా దు చేస్తున్నారు. ఇటీవల నందారపు సంపత్ ఆఫీసు ముందు ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన ఇప్పటివరకు నన్ను కలవలేదు.

గతంలో ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములపై ప్రత్యేక అధికారులతో సర్వే జరిగింది. అప్పుడు తహసీల్దార్ల ప్రమేయం ఉండే ది కాదు. ఇప్పుడు తహసీల్దర్లకు బాధ్య త అప్పగించారు. రికార్డులు పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తం. 

 తహసీల్దార్, అక్కన్నపేట