భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని పులిపాటి నర్సింగ్ కళాశాలలో వసూళ్లు చేస్తున్న అక్రమ ఫీజులను ఆపాలని, ఇంటర్న్‌షిప్ పేరుతో పేద విద్యార్థుల నుండి వసూళ్లు చేసిన రూ 24 వేల తిరిగి ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం డిమాండ్ చేశారు. శుక్రవారం కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బి.వీరభద్రం మాట్లాడుతూ.. పులిపాటి నర్సింగ్ కళాశాలలో ఇంటర్న్ షిప్, కండోనేషన్ ఫీజు పేరుతో అక్రమంగా ఒక్కో పేద విద్యార్థి తల్లిదండ్రుల నుండి రూ 24 వేల ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
పరీక్ష ఫీజులు ఇంటర్మీడియట్ బోర్డు, పారామెడికల్ బోర్డు నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూళ్లు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్మీడియట్, పారామెడికల్ బోర్డుల కళాశాలలు ఒకే కళాశాలలో నిర్వహిస్తున్నారని అన్నారు. కళాశాలలో అర్హులైన సిబ్బంది లేరనీ, ల్యాబ్, ఫైర్ సేఫ్టీ లేవనీ అన్నారు. కేవలం ఫీజుల కొరకే కళాశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. తక్షణమే కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తల్లిదండ్రులెవరూ ఇంటర్న్ షిప్ ఫీజులు, అదనపు పరీక్ష ఫీజులు చెల్లించొద్దని సూచించారు. వసూళ్లు చేసిన అక్రమ ఫీజులు విద్యార్థులకు తిరిగి ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మందా నాగకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రామ్ చరణ్, జిల్లా నాయకులు పి.పవన్, ఎండీ నాహీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.