హైకోర్టులో ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని భార్య పిటిషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మకు చెందిన 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డు, కాంపౌండును కూల్చివేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. 1970 నాటి అమీన్‌పూర్ చెరువు మ్యాప్‌ను సమర్పించాలని, నోటీసు ఇవ్వకుండా చేపట్టిన కూల్చివేతలపై కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలకశాఖ, నీటిపారుల శాఖల ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.
హైడ్రా కూల్చివేతలను సవాల్ చేస్తూ ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ వినోద్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పట్టా భూమిలో ఉన్న కాంపౌండ్, షెడ్లను ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ సెప్టెంబరు 8న హైడ్రా అధికారులు కూల్చివేశారన్నారు.
ఎఫ్టీఎల్ పరిధిలో లేదంటూ గతంలో ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. 900 మామిడి, 5౦౦ జామ, 200 దానిమ్మతోపాటు ఫైనాఫిల్, సీతాఫలం వంటి మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. వీటి రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కాంపౌండ్‌ను కూల్చివేశారని, పునర్నిర్మించుకోవడానికి అనుమతించాలని కోరారు. దీనికి న్యాయమూర్తి నిరాకరిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 3కు వాయిదా వేశారు.