03-04-2025 12:19:03 AM
అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలో ఆగని ఆక్రమణలు
పటాన్ చెరు, ఏప్రిల్ 2 : అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. రాత్రికి రాత్రే బెస్మేంట్ లు, గదులను నిర్మించేస్తున్నారు. అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములు సగం వరకు ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భూముల్లో కాలనీలు వెలిశాయి. సరైన నిఘా లేకపోవడం వలన ఇప్పటి వరకు జరిగినా తప్పిదాలే మళ్ళీ జరుగుతున్నాయి.
ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రే గదులు నిర్మించడం వాటికి పాత తేదీలలో తీసుకున్న ఇంటి నెంబర్లను వేసి అమాయకులకు పది నుంచి ఇరవై లక్షల వరకు అమ్మేస్తూ ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఈ తతంగమంతా కొంత మంది తెల్ల చొక్కాలు వేసుకొని లీడర్లుగా చెలామణి అవుతున్న వారే చేస్తుండడం... దానికి రెవెన్యూ అధికారుల నుంచి ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు ఉండడం విశేషం.
వివరాలలోకి వెళ్తే...అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలో సుమారు పదిహేను వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఒక్క 993 సర్వేనంబర్లోనే దాదాపు 423 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అమీన్ పూర్ పరిధిలోని 1112, 1064, 997, 993, 630, సుల్తాన్ పూర్ పరిధిలోని 30 ప్రభుత్వ భూముల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.
ఐదు సంవత్సరాల క్రింతం అమీన్ పూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. మున్సిపల్గా ఏర్పడిన తరువాత కూడా ఆక్రమణలు ఆగడం లేదు. ప్రభుత్వ భూములపై నిఘా వ్యవస్థ గతం కంటే మరీ అద్వానంగా మారింది. సుల్తాన్ పూర్ పరిధిలోని సర్వేనంబర్ 30లో ఇటీవల కాలంలో రెవెన్యూ అధికారులు రెండు సార్లు అక్రమ ఇండ్ల నిర్మాణాలను కూల్చివేశారు.
ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మేస్తున్న వ్యక్తిపై రెవెన్యూ అధికారులు రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే సర్వేనంబర్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రోడ్లను తొలగించి చుట్టు ట్రంచింగ్ ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలల క్రితం ఈ ప్రభుత్వ భూమిలో రోడ్లు వేసి ప్రత్యేకంగా ఇక్కడికి విద్యుత్ సరఫరా కూడా సదరు వ్యక్తి వేసుకోవడం విశేషం.
అనధికార లే అవుట్ వేసి అమాయక ప్రజలకు రూ. ఐదు, ఏడు, పది, పదిహేను లక్షల వరకు గజాల చొప్పున అమ్ముతున్న ఎలాం టి చర్యలు లేవు. పట్ట పగలు 30 సర్వేనంబర్లో గదుల నిర్మాణాలు దర్జాగా జరుగు తున్నాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు 630, 993 సర్వేనంబర్ లలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేశారు. అక్కడ కూడా మళ్లీ యధావిదిగా బేస్మేంట్ నిర్మాణాలు చేపడుతున్నారు.
పది నిర్మాణాలు జరిగితే రెండు, మూడు తొలగించి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే ఆరో పణ ఉంది. తరువాత మరో పది నిర్మాణా లు జరిగితే అధికారులు మళ్లీ అదే తీరుగా రెండు, మూడు కూల్చేస్తుండడంతో క్రమం గా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు పెరుగుతున్నాయి. కబ్జాలకు గురవుతున్నాయి. అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు ఏర్పాటు చేసి వాటికి డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు.
నవ్యనగర్ నుంచి అమీన్ పూర్ వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఇలా డాక్యుమెంట్ సృష్టించి కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది రెవెన్యూ అధికారులకు తెలిసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సదరు వ్యక్తికే మద్దతు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూము ల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని భూములను కాపాడాలని కోరుతున్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
అమీన్ పూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే కఠిన చర్యలకు తీసుకుంటాము. ఇటీవల ప్రభుత్వ భూముల్లో చేపట్టి న నిర్మాణాలను కూల్చివేశాము. మళ్లీ నిర్మాణాలు చేపట్టకుండా తగిన నిఘాను ఏర్పా టు చేశాము. కూల్చివేస్తున్నప్పటికి మ ళ్లీ మళ్లీ నిర్మాణాలు చేపడుతున్న వారిని గుర్తిం చి వారిపై చట్ట ప్రకారం పోలీస్ కేసులు నమోదు చేస్తాము. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడుతాము.
హరిశ్చంద్ర ప్రసాద్,
అమీన్ పూర్ ఇంచార్జి తహసీల్దార్