calender_icon.png 3 March, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు

03-03-2025 01:23:18 AM

రాత్రికి రాత్రే గదులు, బేస్మెంట్లు నిర్మాణాలు..

కూల్చివేసినా కూడా తిరిగి యథావిధిగా నిర్మాణాలు..

చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం

అంత అధికారుల సహకారమే అంటున్న స్థానికులు

కుత్బుల్లాపూర్, మార్చి 2 (విజయ క్రాంతి): రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ..? అధికారులు తలుచుకుంటే అక్రమాలకు కొదవ అనే తీరుగా మారింది దుండిగల్ గండి మైసమ్మ మండల రెవెన్యూ అధికారుల తీరు... ఓ వైపు హైడ్రా ప్రభుత్వ స్థలాలు,చెరువు,కుంటలను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కు పాదం మోపుతుండగా... దుండిగల్ గండి మైసమ్మ మండలం పరిధిలోని దొమ్మరపోచంపల్లి, గాగిల్లాపూర్ గ్రామంలో భూ కబ్జాల జోరు రోజురోజుకి పెరిగిపోతుంది. హైడ్రా అయినా, అధికారులు అయి నా మమ్మల్ని ఎవరు అడ్డుకునేది అనే తీరులో కబ్జాలకు పాల్పడుతున్నారు.గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలకు ఆశాభావం వ్యక్తం చేసిన స్థానికులకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కూడా చుక్కేదురవుతుందని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

ఇందుకు గల కారణం స్థానిక రెవెన్యూ యంత్రాంగంలోని ఎమ్మార్వో, ఆర్‌ఐ, వీఆర్‌ఏల చీకటి ఒప్పందాలే కారణమని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇష్టారీతిన ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడితే అక్కడ కబ్జారాయుళ్ళు పాగా వేయడం,ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదుదారులపై బెదిరింపులకు పాల్పడడం ఈ ఉదాంతం అంతా అధికారులే వెనక నుండి నడిపిస్తున్నారని ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. లేకుంటే... ప్రభుత్వ స్థలం అక్రమ నిర్మాణం అని అధికారులు తేల్చి కూల్చేసిన తిరిగి యధావిధిగా నిర్మాణాలు చేపట్టడం చూస్తుంటే అధికారుల తీరుపై సందేహం కలగక మానదు కదా..!  ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టాక కూడా భూ కబ్జాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది నాయకులు ఐతే అధికారం చూసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి దుండిగల్ మండలం పరిధి గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 214,డి.పోచంపల్లి సర్వే నెంబర్ 120 ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి.ఒకసారి కూల్చివేతలు జరిగినా కూడా.. తిరిగి రెవెన్యూ అధికారులతో భేరం కుదుర్చుకొని నిర్మాణాలు చేపడుతున్నారు.ఇదేంటి అని అడిగిన వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.కొంతమంది ఏకంగా అధికారం అండ చూసుకొని చెలరేగుతున్నారని కూడా విమర్శలు వెలువెతతుతున్నాయి.

ఈ ఉదాంతం చూస్తున్న స్థానికులు కబ్జారాయుళ్లతో కలిసి అధికారులే కబ్జాలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే అధికారులే అక్రమం అని కూల్చేసి తిరిగి నిర్మాణాలు జరిగితే కబ్జాదారులపై కేసులు నమోదు చేయకపోవడంపై అంతరార్థం ఏంటది వారితో చేసుకున్న చీకటి ఒప్పందాలే అందుకు కారణమా అని అధికారుల తీరుపై ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకొని ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యాయంకృతం అవ్వకముందే చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం

దుండిగల్ మండలం పరిధిలోని డి. పోచంపల్లి సర్వే నెంబర్ 120 బస్తీ,చర్చ్ గాగిల్లాపూర్ 214 పై ఫిర్యాదులు అందాయని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని దుండిగల్-గండిమైసమ్మ మండలం ఎమ్‌ఆర్‌ఓ సయ్యద్ మతిన్ తెలిపారు.ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మా ణాలు చేపడితే ఎంతటి వారైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

-ఎమ్‌ఆర్‌ఓ సయ్యద్ మతిన్