06-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 5 : అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అదుపులేకుండా పోతోంది. కోరడా ఝుళిపిం చాల్సిన అధికారులు చూస్తూ ఊరుకోవడంతో అక్రమాలకు అడ్డకట్ట లేకుండా పోతోంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్న పంచాయతీ అనుమతులతోనే భవనాల నిర్మాణం ఇంకా జరుగుతున్నాయి.
గ్రామ పంచాయతీలుగా ఉన్న కిష్టారెడ్డి పేట, పటేల్ గూడ గ్రామాలు అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఇటీవలే కలిశాయి. కాగా గ్రామ పంచాయతీ నుంచి పాత డేట్లతో అనుమతులు తీసుకుంటూ నిర్మాణాలు చేపడుతున్నారు. జీ ప్లస్ టు అనుమతులు తీసుకొని ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. అమీన్ పూర్ సిటీకి చేరువగా ఉండడంతో ఇక్కడ వందల కాలనీలు వెలిశాయి.
కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ గ్రామాలు పంచాయతీగా ఉన్నప్పుడే ఇక్కడ కూడా కాలనీ విస్తరిచాయి. చెరువు, కుంటల శిఖాలు, బఫర్ జోన్ లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎల్లంకి కళాశాల వెనుక ఉన్న చెరువు, కుంటల శిఖాన్ని ఆక్రమించి ఇండ్లను నిర్మించారు. ప్రభుత్వ భూములు, చెరువు, కుంటల శిఖాలను ఆక్రమించి వెంచర్ల ఏర్పాటు చేసి ఇండ్లను నిర్మిస్తున్న వారంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ నాయకులే కావడం గమనార్హం.
పటేల్ గూడ కుంట శిఖంలో ఆక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వంద నుంచి నూట యాబై గజాల స్థలంలో బెస్మేంట్ లు నిర్మించి అమాయక ప్రజలకు అమ్మేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ యాబై ఇండ్ల వరకు చెరువు శిఖంలో నిర్మించారు. మరో వైపు అమీన్ పూర్ పెద్ద చెరువు ముంగిట వాణి నగర్ వైపు చెరువు శిఖంలోనే ఇండ్లను నిర్మించారు. మరిన్ని ఇండ్ల నిర్మాణాలకు చెరువు శిఖంలో మట్టిని పూడ్చారు.
మరో వైపు సర్వేనంబర్ 993, 673 ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. రాత్రికి రాత్రే గదులు నిర్మించి ఫేక్ ఇంటి నంబర్లు రాస్తున్నారు. మరి కొన్ని భూములు కోర్టు పరిధిలో ఉండగానే నిర్మాణాలు చేస్తున్నారు. నిర్మించిన ఇండ్లలో కుటుంబాలను తీసుకొచ్చి పెడుతున్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇండ్లు నిర్మించడం అనేది వ్యాపారంగా మారింది.
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మిస్తున్న సంగతి రెవెన్యూ అధికారులకు, అనుమతికి మించి బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారని మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు, చెరువు, కుంటల శిఖం, ఎఫ్టీఎల్ లో ఇండ్ల నిర్మాణం జరుగుతోందని నీటి పారుదల శాఖ అధికారులకు తెలిసిన ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తేనే ఏదో మమ అనిపించే చర్యలు తీసుకుంటున్నారు.
మరో వైపు ప్రభుత్వ భూములను, చెరువు, కుంటలను రక్షించాల్సిన రెవెన్యూ, నీటి పారుదల శాఖల మద్య సమన్వయం లేకపోవడంతో అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చెరువు, కుంటలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే వందల ఎకరాలు ఆక్రమణకు గురవగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ భూములను ఆక్రమించి రాత్రికి రాత్రి నిర్మించిన పలు ఇండ్లను జేసీబీలతో కూల్చివేయించాము. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా నిఘాను ఏర్పాటు చేశాము. ఆర్‌ఐ లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాము. నిబందనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాము.
హరిశ్చంద్ర ప్రసాద్, ఇంచార్జి తహసీల్దార్ అమీన్ పూర్