13-04-2025 11:17:09 PM
అధికారుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో బాధితుల ఆవేదన
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గణేశ్ నగర్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెట్ బ్యాక్ నిబంధనలను తుంగలో తొక్కి కొందరు నిర్మాణాలు చేపడుతుండడంతో చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేశ్ నగర్‌కు చెందిన బాధితుడు ఎంపీ గౌడ్ తన ఇంటి పక్కనే జరుగుతున్న అక్రమ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. తన స్థలానికి ఆనుకొని ఉన్న గోడ మీదుగా అక్రమంగా నిర్మాణం చేపట్టడం వల్ల తమ ఆస్తికి భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ నిర్మాణం మున్సిపల్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోందని ఆయన స్పష్టం చేశాడు.
ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పరిస్థితిని పరిశీలించి, అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆయన, ఇతర కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. "అక్రమ నిర్మాణాల వల్ల పౌరుల ఆస్తులకు, వారి భద్రతకు హాని కలుగుతోంది. మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. హుస్నాబాద్‌లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఉన్నవారికి ఒక న్యాయం, లేనివారికి ఒక న్యాయం అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి" అని బాధితుడు సోషల్ మీడియా వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.