08-02-2025 05:30:55 PM
చోద్యం చూస్తున్న అధికారులు..
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల వెనకాల శనివారం పట్టపగలే అక్రమంగా బోర్వెల్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బోర్ వెల్ వేస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అండతో బోర్ వేస్తున్నట్లు స్థానికులు గుసగుసలాడుతున్నారు. పొలంలో, ఇంటి కోసం బోర్ వెల్ నిర్మాణం చేయాలంటే రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎవరి అనుమతులు లేకుండా బోర్వెల్ నిర్మాణం చేపట్టారు. అక్రమ బోర్వెల్ నిర్మాణంపై స్థానికుల కొందరు రెవెన్యూ అధికారికి సమాచారం ఇవ్వగా రెవెన్యూ ఆర్ ఐ ఆ స్థలానికి వెళ్లగా అక్కడ కేవలం పైపులు మాత్రమే ఉన్నాయి.
బోర్ వెల్ వాహనాలు మాయమైనట్లు సమాచారం. అధికారి వారికి సమాచారం ఇచ్చాడా లేక సమాచారం అందుకున్న బోర్ వెల్ నిర్వాహకులు వాహనాలను మాయం చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా గత నెల రోజుల క్రితం నవభారత్ జాతీయ రహదారిపై బోర్ వేస్తున్న అధికారులు పట్టించుకోలేదని అక్కడి స్థానికులు వాపోయారు. బోర్ వెల్ నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులకు మధ్య ఏదో సంబంధం ఉందని పట్టణ ఆరోపణలు వినిపిస్తున్నాయి.