- తుర్కయంజాల్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఇబ్రహీంపట్నం, నవంబర్ ౩ (విజయక్రాంతి): ఒక సామన్యుడు ఇల్లు నిర్మించు కోవాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదే బడాబాబులు అయి తే నిబంధనలేవీ వారికి పెద్దగా వర్తించవు. యంత్రాంగాన్ని ‘మామూలు’గానే అదుపులో పెట్టుకుని తమ పని కానిచ్చేస్తుం టారు.
ఇదే కోవలో రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ (పాటిగూడ)లో ఓ బడాబాబు అడ్డగోలుగా అక్రమ కట్టడం నిర్మించాడు. దానికి మున్సిపాలిటీతో పాటు హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అలాగే సదరు కట్టడాలకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
సాధారణంగా మున్సిపాలిటీ అక్రమ కట్టడాలను గుర్తించి, వాటిని జిల్లా టాస్క్‌ఫోర్స్ (డీటీఎఫ్) కూల్చివేయాల్సి ఉంటుంది. కానీ, అలాంటి ఉదాహరణ తుర్కయంజాల్‌లో మచ్చుకైనా కనిపించడంలేదు. అసలు భవనానికే అనుమతులు లేవంటే.. ఆ భవనంలో బడాబాబు స్కూల్ నడుపుతుండడం గమనార్హం.
ఆ స్కూలుకు సైతం అరకొర అనుమతులే ఉన్నాయని తెలిసింది. నిబంధనల పేరుతో పేద, మధ్యతరగతి నిర్మించు కున్న చిన్న నిర్మాణాలను కూల్చుతారే తప్ప.. బడాబాబులు నిర్మించిన కట్టడాల జోలికి మున్సిపాలిటీ వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ‘రాగన్నగూడలో నిర్మించిన భవనానికి మున్సిపాలిటీ నుంచి వారు అనుమతులు లేవు.
హెచ్‌ఎండీఏ అనుమతుల కోసం యజమాని దరఖాస్తు చేసుకున్నాడని తెలిసింది. అయితే.. ఆ నిర్మాణం నేను ఇక్కడ బాధ్యతలు తీసుకోకముందే జరిగింది. నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీ యజమానికి నోటీసులు ఇచ్చింది. ఆ అంశాన్ని మరోసారి పరిశీలిస్తాం’ అని సమాధానమిచ్చారు.