- ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్
ల్యాప్‌లాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం
పరారీలో ప్రధాన నిందితుడు
వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ
నల్లగొండ, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో విలేకరుల మునుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గుర్తింపు లేని ఓ డిజిటల్ పత్రికకు చెందిన ఇద్దరు నకలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్ట్యాప్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. ఆదివారం మిర్యాలగూడలోని తన కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.
క్రైమ్ మిర్రర్ అనే డిజిటల్ పత్రికలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లేకుండా వీరగాథ అనే పేరుతో కథనం రాసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రూ. 2 లక్షలు ఇస్తే తప్పుడు వార్తలు రాయమని ఆ పత్రిక రిపోర్టర్లు చెప్పడంతో తాను ఏ తప్పూ చేయలేదని సీఐ నిరాకరించాడు.
నిరాధారణ ఆరోపణల కారణంగా సీఐతోపాటు కుటుంబీకులు కుంగిపోతుండడంతో ఆయన స్నేహితుడు క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ పేరబోయిన ఆంజనేయులు (అంజి)ని ఇంటికి పిలిచి రూ. లక్షా 10 వేలు ముట్టజెప్పాడు. ఇందులో రూ. 10 వేలు తన వద్ద ఉంచుకొని ఆ పత్రిక స్టాప్ రిపోర్టర్ తుప్పరి రఘుకు రూ. లక్ష ఇచ్చాడు. ఇందులో రూ. 15 వేలు తీసుకున్న రఘు మిగిలిన మొత్తాన్ని చీఫ్ ఎడిటర్ ఆనంద్కుమార్కు పంపాడు.
అంతటితో ఆగని నిందితులు వ్యక్తిగత విషయాలు రాస్తామని సీఐని బెదిరించారు. దీంతో ఆయన మిర్యాలగూడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయంలో బయటకు రావడంతో సాగర్లోని ఓ అటవీశాఖ అధికారి, సూర్యాపేట జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఏఎస్‌ఓ సైతం వీరి వసూళ్ల పర్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఆధారాలు లేకుండా డిజిటల్ పత్రికలో పోలీసులు, ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా తప్పుడు కథనాలు రాసి డబ్బులివ్వకుంటే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. క్రైమ్ మిర్రర్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఆనంద్కుమార్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.