కాంట్రాక్ట్ ఉద్యోగికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి భాగోతం
కామారెడ్డి (విజయక్రాంతి): తాను పని చేసేది కాంట్రాక్టు ఉద్యోగం కానీ మెడికల్ ఆఫీసర్ అవతారం ఎత్తాడు. జిల్లా వైద్య శాఖ అధికారి పేరున వసూళ్లకు పాల్పడ్డాడు. చివరికి అనుమానం వచ్చిన ఆర్ఎంపీ వైద్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి ఆ నకిలీ వైద్యునిగా అవతారం ఎత్తిన కాంట్రాక్టు ఉద్యోగినీ పోలీసులకు అప్పగించిన ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి పల్లె దవఖానాలో కాంట్రాక్టు ప్రతిపాదికన పనిచేస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి మెడికల్ ఆఫీసర్ అంటూ అవతారం ఎత్తి పీఎంపీ ఆర్ఎంపి వైద్యుల వద్దకు వెళ్లి జిల్లా వైద్య శాఖ అధికారి పంపించాడు డబ్బులు ఇవ్వాలని కోరడంతో కొందరు ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులు నకిలీ వైద్యాధికారి చెప్పిన కాడికి డబ్బులు ముట్ట చెప్పారు.
శుక్రవారం లింగంపేట మండలంలో ఓ ఆర్ఎంపి వద్దకు వెళ్లి జిల్లా వైద్యశాఖ అధికారి పేరిట 15,000 వేలు వసూలు చేశాడు. అక్కడి నుంచి మరో ఆర్ఎంపి వైద్యుని వద్దకు వెళ్లి 20,000 వేలు డిమాండ్ చేశాడు. అతడు బతిమాలి 10,000 వేలు ముట్ట చెప్పాడు. అయితే కొద్దిసేపటికి అనుమానం వచ్చిన ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యులు బాలకృష్ణను నిలదీశారు. దీంతో బాలకృష్ణ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నకిలీ వైద్యుడిగా తమను డబ్బులు డిమాండ్ చేశాడని బాలకృష్ణను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆప్పుడు అతని అసలురూపం బయటపడింది. ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి పల్లె దావఖానాలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై లింగంపేట మండల మెడికల్ ఆఫీసర్ హీమా బిందును విజయ క్రాంతి వివరణ కోరగా బాలకృష్ణ కాంట్రాక్టు ఉద్యోగీగా పల్లె దావఖానాలో పనిచేస్తున్నారని తెలిపారు. అతనిపై జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.
బాలకృష్ణపై చర్యలు తీసుకుంటాం... చంద్రశేఖర్ జిల్లా వైద్యాధికారి కామారెడ్డి
జిల్లా వైద్యాధికారి పేరిట ఆర్ఎంపీల వద్ద బాలకృష్ణ అనే కాంట్రాక్టు ఉద్యోగి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ ముగ్గురు వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. విచారణ చేపట్టి బాలకృష్ణపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు.