ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్..
ఇల్లెందు (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని ఉమ్మడి ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇల్లందు పట్టణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినా గానీ తప్పుడు సమాచారంతో అసెంబ్లీ ముట్టడిస్తున్నామని తప్పుడు ఆరోపణలతో పార్టీ తనతో పాటు, నాయకులు సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీను, అబ్దుల్ నబిని అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడచడమేనని అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టినందుకు, నిరంతరం ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండబెడుతూ ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులను టార్గెట్ చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఎప్పుడు ఎలాంటి కేసుల్లో ఇరికించాలని తప్పుడు ధోరణిని ఇకనైనా మానుకొని ప్రజా సంక్షేమంపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన వారం కేసులు మాకు కొత్తవి కాదని, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డ వారం ఈ ఉడత బెదిరింపులకు, పిట్ట బెదిరింపులకు అదిరేది లేదు బెదిరేది లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.