భూమిని కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి
ధర్నాచౌక్‌లో బాధితుల భారీ ధర్నా
రాజగోపాల్‌నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. లక్ష్మీనారాయణ
ముషీరాబాద్,(విజయక్రాంతి): అధికారుల ప్రోద్బలంతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మల్లండి సందీప్‌కుమార్ ఆరోపించారు. గత 40 సంవత్సరాల క్రితం సేల్‌డీడ్ ద్వారా స్థలాలను కొనుగోలు చేయడం జరిగిందని వారు తెలిపారు. తమ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వందలాది మంది బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయమై 3 కేసుల్లో తమకు న్యాయంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికి కొంద మంది కబ్జాదారులు ఈ స్థలం తమదంటూ ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. పలు మార్లు తమ స్థలాల్లో కబ్జాలు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే గతంలో 250 కట్టడాలను కూడా కూల్చివేశారని, మరోసారి 6 వందల మంది కబ్జాదారులు కబ్జా చేశారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ పరిధిలోని రాజగోపాల్‌నగర్ లే అవుట్‌లోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు 408 ఎకరాలకు పైగా కోర్టు కేసు పరిధిలో ఉందని, ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు, లావాదేవీలు జరపరాదని కోర్టు స్టేటస్కో ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, న్యాయస్థానాలు జోక్యం చేసుకొని 40 సంవత్సరాల క్రితం తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాలు కబ్జా కాకుండా తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. నోటరీ, రిజిస్ట్రేషన్‌లను, జీపీఏ వంటి డాక్యూమెంట్‌లు సేల్ డీడ్‌తో సమానం కావని, అవి యజమాని హక్కులు బదిలీ చేయలేవని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గతంలో పేర్కొన్నదని వారు గుర్తు చేశారు. ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ లే అవుట్‌లోని ప్లాట్లను, ఇండ్లను కొనుగోలు చేయరాదని, ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని వారు పేర్కొన్నారు. లోకల్ మాఫియా నాయకుల్ని నమ్మి మోసపోవద్దని వారు కోరారు. ఈ దందా వెనుకాలో ఎంతమంది బడా నాయకులున్నా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆర్‌వీ రమణ మూర్తి, డి. శ్రీనివాస్ రావు, కార్యదర్శులు డి. సుదర్శన్, సీ. చంద్రశేఖర్, కోశాధికారి కే. రమేష్, జాయింట్ సెక్రెటరీ సీహెచ్. సత్యనారాయణ యాదవ్, స్వప్న, రఘునాథ్, హర్షశాస్త్రీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.