జపాన్ కాన్సుల్ జనరల్ తకహషి మునెయో
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): జపాన్ కళ ‘ఇకెబన’ నేటి తరానికి ఎంతో అవసరమని జపాన్ కాన్సు ల్ జనరల్ తకహషి మునెయో అన్నారు. ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబన హైదరాబాద్‌లోకి ప్రవేశించి 35 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో ఇకెబన ఆర్ట్‌పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళలో అందం కంటే వ్యక్తీకరణ ఎంతో ముఖ్యమన్నారు. మనుషుల్లో ఉన్న ఆందోళనను తొలగించి ప్రశాంతను అందించడంలో ఇకెబన తోడ్పడుతుందన్నారు.
మనుషుల్లో సహనాన్ని పెంపొందించేందుకు ఈ కళ ఉపయోగపడుతుంద న్నారు. ఓటమిపాలైనప్పుడు మరింత పట్టుదలతో మరోసారి ప్రయత్నించేందుకు సాయం చేస్తుందన్నారు. ఇకెబన ఆర్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు నిర్మల అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ కళను పొందితే ప్రతివ్యక్తి ప్రశాంతమైన జీవితం గడుపవచ్చన్నారు. దీనిపై గురు, శుక్రవారాల్లో ప్రత్యేకం గా వర్క్‌షాపు నిర్వహిస్తామన్నారు.