calender_icon.png 22 September, 2024 | 6:45 PM

ఐఐటీ విద్యార్థుల గంజాయి దందా

22-09-2024 02:28:32 AM

ఎస్సార్‌నగర్ పీజీ హాస్టల్లో అమ్మకాలు  

ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా..

 2.94 కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు అరెస్ట్, 22 మందిపై కేసు

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసుల వెల్లడి

నిందితులంతా ఏపీ రాష్ట్రానికి చెందిన వారే

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఉన్నతమైన ఉద్యోగం ఒకరిది.. అత్యున్నతమైన చదువు మరో ఇద్దరివి. వారంతా గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు ఐఐటీ విద్యార్థులు ఎస్సార్‌నగర్‌లోని వినాయక ఎగ్జిక్యూటివ్ పీజీ హాస్టల్లో ఉంటూ గంజాయిని అమ్ముతున్నారు. మరో ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గంజాయికి అలవాటు పడి ఉద్యోగం కోల్పోయాడు. 

ఐఐటీ మధ్యలోనే ఆపేసి..

ఏపీలోని నెల్లూరుకు చెందిన కొలి మణికంఠ చౌదరి, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వీ పవన్ ఇద్దరూ ఐఐటీ విద్యార్థులు. వీరు గంజాయికి బానిసలై చదువును మధ్యలోనే ఆపేశారు. ఈ క్రమంలో ఎస్సార్‌న గర్‌లోని వినాయక ఎగ్జిక్యూటివ్ పీజీ హాస్టల్లో హాస్టల్‌మేట్స్. కావాల్సిన వారికి 20 గ్రాముల గంజాయిని రూ.వెయ్యి చొప్పున అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్‌టీఎఫ్ పోలీసులు శనివారం ఆ హాస్టల్లో దాడులు నిర్వహించి పవన్, మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయిని కొనుగోలు చేసిన 22 మందిని గుర్తించి, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్‌టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.  వీరికి గంజాయి సరఫరా చేసిన విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన కమలేశ్, అమోశ్‌పై కేసులు నమోదు చేశామని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్..

నెల్లూరు జిల్లా అల్లంపాడు ప్రాంతానికి చెందిన ఎర్రగంటి లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గంజాయికి అలవాటు పడిన లోకేశ్ డ్యూటీకి సరిగా హాజరుకాకపోవడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని, ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆకుల శ్రీకాంత్ వద్ద కిలో గంజాయిని రూ. 20 వేలకు కొనుగోలు చేసి రూ. వెయ్యికి 20 గ్రాముల గంజాయి చొప్పున అమ్ముతున్నాడు. అమ్మకాలపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసు లు శనివారం మణికొండలోని లోకేశ్ ఇంట్లో  తనిఖీలు నిర్వహించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద 1.74 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. లోకేశ్‌తోపాటు ఆకుల శ్రీకాంత్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు ఘటనల్లో మొత్తం ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్‌టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలో గంజాయిని పట్టుకున్న టీమ్ సీఐ ఆర్ చంద్రశేఖర్, ఎస్సై సాయి కిరణ్‌రెడ్డి, హెచ్‌సీలు భాస్కర్‌రెడ్డి, శ్రీధర్, అజీమ్, కానిస్టేబుళ్లు ప్రకాశ్, రాకేశ్, అశ్విన్, అహ్మద్‌లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.