calender_icon.png 3 February, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఫా అవార్డ్స్ 9 విభాగాల్లో లాపతా లేడీస్

03-02-2025 01:06:01 AM

ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఐఎఫ్‌ఏ) 2025 నామినేషన్లలో బాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. ఐఐఎఫ్‌ఏ (ఐఫా) తాజాగా ప్రకటించిన నామినేషన్లలో ‘లాపతా లేడీస్’ అత్యధిక విభాగాల్లో నామినేషన్లను సొంతం చేసుకుంది. ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా తొమ్మిది విభాగాల్లో ఎంపికయ్యింది.

ఇంకా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం ఏడు, ‘స్త్రీ 2’ సినిమా ఆరు విభాగాల్లో బరిలో నిలిచాయి. అయితే ఉత్తమ చిత్రం విభాగానికి నామినేషన్లలో ‘లాపతా లేడీస్’, ‘భూల్ భూలయ్యా 3’, ‘స్త్రీ 2’, ‘కిల్’, ‘ఆర్టికల్ 370’, ‘షైతాన్’ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ దర్శకత్వం కేటగిరిలో కిరణ్‌రావు, నిఖిల్ నగేశ్ భట్, అమర్ కౌశిక్, సిద్ధార్థ్ ఆనంద్, అనీస్ బజ్మీ, ఆదిత్య సుహాన్ ఝంబాలే పోటీ పడనున్నారు.

ఉత్తమ నటి కేటగిరిలో నితాన్షి గోయెల్, అలియా భట్, యామీ గౌతమ్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ బరిలో ఉండగా ఉత్తమ నటులుగా స్పర్ష్ శ్రీవాస్తవ, రాజ్‌కుమార్‌రావు, కార్తీక్ ఆర్యన్, అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్‌లకు నామినేషన్లు దక్కాయి. ఇక సపోర్టింగ్ రోల్ కేటగిరిలో ఛాయా కదమ్,న విద్యాబాలన్, జాంకీ బోడివాలా, జ్యోతిక, ప్రియమణి ఉండగా.. రవికిషన్, అభిషేక్ బెనర్జీ, ఫర్దీన్ ఖాన్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా మేల్ విభాగంలో తలపడనున్నారు.

ఉత్తమ ప్రతినాయక కేటగిరిలో రాఘవ్ జుయల్, ఆర్ మాధవన్, గజరాజ్‌రావ్, వివేక్ గోంబర్, అర్జున్ కపూర్ నామినీలుగా నిలిచారు. ఈ ఏడాదికి సంబంధించి ఐఫా వేడుక వచ్చే మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జైపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది.