మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 6 (విజయక్రాంతి)/నర్సాపూర్: ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. శనివారం నర్సాపూర్ పట్టణంలో పర్యటించిన ఆయన.. బస్టాండ్‌ను, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా బస్టాండ్‌లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఉచిత ప్రయాణంపై మహిళలతో ముచ్చటించారు.
అనంతరం నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలోని జెడ్పీహెచ్‌ఎస్, అంగన్‌వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనాలను తనిఖీ చేశారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోధించారు. రానున్న రోజుల్లో ‘గ్రౌండ్ బెస్ట్ లెర్నింగ్’ అనే కార్యక్రమం కోసం చర్యలు చేపట్టాలని, జిల్లా స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డికి సూచించారు.
నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం తనిఖీ..
నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారులు సమయపాలన పాటించాలని, పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌ఎస్‌ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నంబర్లు, సక్సేషన్, మ్యూటేషన్ మొదలైన సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.