27-03-2025 12:57:35 AM
నిజామాబాద్, మార్చి 26 (విజయ క్రాంతి): రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముస్లిం ఉద్యోగులు, టీజీవో ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. వారి ప్రార్థనలు ఫలించి నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గజిటెడ్ అధికారుల సంఘం ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుందని, ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారని అభినందించారు.
ముందు ముందు ఇదే తరహా స్ఫూర్తిని కనబరచాలని సూచించారు. టీజీవో సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ, అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
అందులో భాగంగానే రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, రంజాన్ మాసం పవిత్రత’ ప్రాశస్త్యం గురించి ముస్లిం మత పెద్ద మౌలానా హాఫిజ్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ తెలియజేశారు. ఇఫ్తార్ విందులో టీజీవో ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, లేబర్ ఆఫీసర్ యోహన్, డిసిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.