21-04-2025 12:21:00 AM
కంటి వైద్య శిబిరంలో పల్లా
చేర్యాల, ఏప్రిల్ 20: జీవిత మలిదశ వ యసులో చూపు బాగుంటేనే జీవితం సాఫీ గా సాగుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రం లోని జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్లో బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వృద్ధాప్యంలో వారి దినసరి చర్యలు సాఫీగా చేసుకోవడానికి కళ్ళే ముఖ్యమని అన్నారు. ఇతరులకు భారం కాకుండా ఉండడానికి మిగతా జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా గడపడానికి కంటి చూపు చాలా అవసరం అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే కెసిఆర్ ఆనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమంద్వారా వైద్య పరీక్షలు చేయించారన్నారు.
బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఇంత చక్కటి కార్యక్రమం కొమురవెల్లి లో నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేయించి, కళ్ళజోళ్ళు మందులు పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు. ఆపరేషన్లు అవసరం ఉన్న 85 మందికి ఆపరేషన్లు హైదరాబాదులో చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి, ముత్యం నరసింహులు, ఎరుపుల మహేష్, గొల్లపల్లి కిష్టయ్య, బుడిగె గురువయ్య గౌడ్, సిల్వర్ సిద్ధప్ప, గొల్లపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పల్లా
ఇటీవల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులకు కొమరవెల్లి కమాన్ వద్ద గల ఇంటి పైనున్న రేకులు లేచిపోయాయి. దీంతో నిలువ నీడ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబమైన జంగపల్లి లక్ష్మణ్ పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు.